Gautam Gambhir-Harshit Rana: హర్షిత్ రాణాకు గంభీర్ హెచ్చరిక
ABN , Publish Date - Oct 26 , 2025 | 01:06 PM
సిడ్నీలో జరిగిన మూడో వన్డేకు ముందు టీమిండియా బౌలర్ హర్షిత్ రాణాపై హెడ్ కోచ్ గంభీర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒక దశలో సరిగ్గా ఆడకపోతే.. జట్టులో కొనసాగడం కష్టమేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని హర్షిత్ రాణా చిన్ననాటి కోచ్ శ్రవణ్ వెల్లడించాడు..
సిడ్నీలో జరిగిన మూడో వన్డేకు ముందు టీమిండియా బౌలర్ హర్షిత్ రాణాపై హెడ్ కోచ్ గంభీర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒక దశలో సరిగ్గా ఆడకపోతే.. జట్టులో కొనసాగడం కష్టమేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని హర్షిత్ రాణా చిన్ననాటి కోచ్ శ్రవణ్ వెల్లడించాడు.
ఆసియా కప్‌లో హర్షిత్ రాణా (Harshit Rana) అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అతడిని ఆస్ట్రేలియాతో వన్డే జట్టులోకి తీసుకోవడంపై కోచ్ గౌతమ్ గంభీర్‌పై (Gautam Gambhir) తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా అవన్నీ పట్టించుకోకుండా రాణాను వెనకేసుకొస్తూ మీడియా, విశ్లేషకులకు గంభీర్ కౌంటర్లు ఇచ్చాడు. కానీ, ఆసీస్ పర్యటనలో కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో అంతంత మాత్రంగానే రాణించడంతో .. ఇక లాభం లేదనుకొని రాణాను కోచ్ తీవ్రంగా హెచ్చరించాడు. ఈ విషయాన్ని హర్షిత్ తనకు మ్యాచ్ ముందు ఫోన్ చేసి వెల్లడించాడని శ్రవణ్ తెలిపాడు.
‘హర్షిత్ మ్యాచ్‌కు ముందు నాకు ఫోన్ చేశాడు. తన ప్రదర్శనపై బయట నుంచి వస్తున్న విమర్శలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. దీంతో నీ మీద నీవు నమ్మకం ఉంచుకో అని చెప్పాను. కొందరు క్రికెటర్లు కోచ్ గంభీర్‌కు హర్షిత్ దగ్గరి వ్యక్తి అని చెబుతుంటారు. కానీ, ప్రతిభను గుర్తించి వారికి గంభీర్ మద్దతుగా ఉంటాడు. అలాగే చాలా మంది క్రికెటర్లకు అండగా నిలిచాడు. వారంతా కెరీర్‌లో అద్భుతాలు చేశారు. వాస్తవానికి ఆయన హర్షిత్‌ను తీవ్రంగా హెచ్చరించాడు. ‘ఆటలో రాణించు.. సరిగ్గా ఆడకపోతే జట్టు బయట కూర్చోబెడతా’ అని నేరుగా హర్షిత్‌కే చెప్పాడు. రాణా ఇంకా 23 ఏళ్ల కుర్రాడే.. అతడికి ఇంకొంత సమయం ఇవ్వాలి’ అని శ్రవణ్ వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో రాణాపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ క్రికెటర్ శ్రీకాంత్‌ను తప్పుబట్టాడు. యూట్యూబ్ ఛానల్స్‌కు ఆదాయం పెంచడానికి కుర్రాళ్లను లక్ష్యం చేసుకోవడం పద్ధతి కాదని అన్నాడు. మరోవైపు.. శనివారం సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయానికి హర్షిత్ రాణా కీలక పాత్ర పోషించాడు. నాలుగు కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
ఇవి కూడా చదవండి..
ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ
పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్