Daniil Medvedev Fined: యూఎస్ ఓపెన్‌లో మెద్వెదేవ్‌కు రూ.37 లక్షల ఫైన్..ఏం చేశాడో తెలుసా..
ABN , Publish Date - Aug 28 , 2025 | 04:58 PM
యూఎస్ ఓపెన్ 2025 టెన్నిస్ టోర్నీలో రష్యన్ స్టార్ డేనియల్ మెద్వెదేవ్ చేసిన ప్రవర్తన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అంపైర్‌తో వాదన, ఫోటోగ్రాఫర్‌పై అరుపులు, చివరికి రాకెట్‌ను నేలకేసి పగలగొట్టడం వంటి కారణాలతో అతనికి రూ.37 లక్షల ఫైన్ పడింది.
రష్యన్ టెన్నిస్ స్టార్ డేనియల్ మెద్వెదేవ్ (Daniil Medvedev) యూఎస్ ఓపెన్ 2025లో తన కోపంతో చర్చనీయాంశంగా మారాడు. మొదటి రౌండ్ మ్యాచ్‌లో అంపైర్, ఫోటోగ్రాఫర్‌పై అరిచి, రాకెట్‌ను పగలగొట్టిన అతను, ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించి, ఏకంగా $42,500 (సుమారు రూ. 37 లక్షలు) జరిమానాకు గురయ్యాడు. ఈ ఘటన టెన్నిస్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ జరిమానా అతని మ్యాచ్ ఫీజు $1,10,000 నుంచి తీసివేయబడుతుంది. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మాజీ నంబర్ వన్‌కు షాక్ ఓటమి
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఒకప్పుడు నంబర్ వన్‌గా ఉన్న మెద్వెదేవ్, 2021లో యుఎస్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ, ఈ సారి యుఎస్ ఓపెన్ 2025 అతనికి నిరాశ మిగిలింది. మొదటి రౌండ్‌లోనే బెంజమిన్ బోంజీ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతని ఆట కంటే, కోర్టులో అతని ప్రవర్తనే హైలైట్‌గా నిలిచింది.
ఫోటోగ్రాఫర్‌పై కోపం, అంపైర్‌తో వాగ్వాదం
మూడో సెట్‌లో బెంజమిన్ బోంజీ 5-4 స్కోరుతో ఆధిక్యంలో ఉన్న సమయంలో, ఒక ఫోటోగ్రాఫర్ కోర్టు వైపు నడవడం ప్రారంభించాడు. ఇది మెద్వెదేవ్‌కు అసహనం కలిగించింది. అతను వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశాడు. చైర్ అంపైర్ గ్రెగ్ అలెన్స్‌వర్త్ ఫోటోగ్రాఫర్‌ను వెళ్లిపోమని ఆదేశించినప్పటికీ, బోంజీకి సర్వ్ చేసే అవకాశం ఇచ్చాడు. ఈ నిర్ణయం మెద్వెదేవ్‌ను మరింత కోపం కలిగించింది. ఆ క్రమంలో అంపైర్‌పై అరవడం ప్రారంభించాడు. ఇది సరైన నిర్ణయం కాదని తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
రాకెట్ ధ్వంసం
మ్యాచ్ ఓడిపోయిన తర్వాత, మెద్వెదేవ్ తన కోపాన్ని రాకెట్‌పై చూపించాడు. కోర్టులోనే రాకెట్‌ను బలంగా గట్టిగా కొట్టి, దానిని పూర్తిగా ధ్వంసం చేశాడు. ఈ ఘటన కోర్టులో ఉన్న అభిమానులను, అధికారులను షాక్‌కు గురిచేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టోర్నమెంట్ రిఫరీ జాక్ గార్నర్ ఈ ప్రవర్తనను ఆట స్ఫూర్తికి విరుద్ధంగా పరిగణించారు. అంపైర్‌తో అనుచితంగా ప్రవర్తించినందుకు $30,000, రాకెట్‌ను పగలగొట్టినందుకు $12,500 జరిమానా విధించారు. ఈ జరిమానా మొత్తం అతని మ్యాచ్ ఫీజు నుంచి తీసివేయబడుతుందన్నారు.
ఫోటోగ్రాఫర్‌పై చర్యలు
ఈ గొడవకు కారణమైన ఫోటోగ్రాఫర్ కూడా తప్పించుకోలేదు. సర్వీస్ సమయంలో కోర్టు పక్కన నడిచినందుకు అతని గుర్తింపు (అక్రిడిటేషన్) రద్దు చేయబడింది. టోర్నమెంట్ నిబంధనల ప్రకారం, ఆట సమయంలో ఫోటోగ్రాఫర్లు కోర్టు సమీపంలో ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు అతనిపై ఈ చర్య తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి