Share News

PBKS vs MI: ఫైనల్ కాని ఫైనల్.. ఈ నలుగురి ఆట అస్సలు మిస్ అవ్వొద్దు!

ABN , Publish Date - May 26 , 2025 | 06:05 PM

పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఇవాళ కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన టీమ్ క్వాలిఫయర్‌-1కు అర్హత సాధిస్తుంది. అందుకే రెండు జట్లు తప్పక గెలవాలని అనుకుంటున్నాయి.

PBKS vs MI: ఫైనల్ కాని ఫైనల్.. ఈ నలుగురి ఆట అస్సలు మిస్ అవ్వొద్దు!
PBKS vs MI

ఐపీఎల్-2025లో ఇవాళ కొదమసింహాల మధ్య కొట్లాట జరగనుంది. ఒకరకంగా ఇది ఫైనల్ కాని ఫైనల్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఇవాళ్టి పోరులో నెగ్గిన జట్టు క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తుంది. టోర్నీ ఫైనల్‌కు వెళ్లేందుకు ఇదో చక్కటి మార్గం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నేటి ఫైట్‌లో గెలిచి తీరాలని అటు హార్దిక్ సేన, ఇటు అయ్యర్ ఆర్మీ పట్టుదలతో ఉన్నాయి. ఓడితే ఎలిమినేటర్‌‌లో తలపడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రమాదం రాకుండా చూడాలని రెండు జట్లు భావిస్తున్నాయి. క్వాలిఫయర్‌-1కు వెళ్తే ముంబైని ఆపలేం. దాదాపుగా క్వాలిఫయర్‌లో ఆడిన ప్రతిసారి ఆ టీమ్ ఫైనల్‌కు వెళ్లడమే గాక కప్పు కూడా కొట్టింది. అందుకే ఇదే తుదిపోరుగా భావించి.. ఇక్కడే ఆ జట్టు ఆటకట్టించాలని పంజాబ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫైనల్ కాని ఈ ఫైనల్ పోరులో ఎవరెవరి ఆట తప్పకుండా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..


ట్రెంట్ బౌల్ట్

ముంబై ఇండియన్స్ బౌలింగ్ అనగానే అంతా జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా గురించే మాట్లాడతారు. కానీ ఆ జట్టు బౌలింగ్ ఆయువుపట్టు బౌల్ట్ అనే చెప్పాలి. చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతున్నాడీ స్పీడ్‌గన్. ఈ సీజన్‌‌లో ఇప్పటికే 19 వికెట్లు తీసిన బౌల్ట్ గేమ్ చేంజర్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అతడ్ని ఎలా ఎదుర్కొంటారనే దాని మీదే పంజాబ్ భారీ స్కోరు ఆశలు ఆధారపడి ఉంటాయి.

అర్ష్‌దీప్ సింగ్

పంజాబ్ జట్టు బౌలింగ్ యూనిట్ అర్ష్‌దీప్ మీద అతిగా ఆధారపడుతోంది. ఈ సీజన్‌లో 16 వికెట్లు తీసిన ఈ పంజాబ్ పుత్తర్.. ఈ మ్యాచ్‌లో రాణించాలని కసితో ఉన్నాడు. అతడు గానీ చెలరేగితే ముంబైకి కష్టాలు తప్పవు.

mi.jpg


సూర్యకుమార్ యాదవ్

రోహిత్ శర్మ దగ్గర నుంచి హార్దిక్ పాండ్యా వరకు ముంబై జట్టు నిండా స్టార్లే. కానీ అందరికంటే సూర్యకుమార్ యాదవ్ ఆ టీమ్ విజయాల్లో ఎక్కువగా కీలకపాత్ర పోషిస్తున్నాడు. సూర్య రాణిస్తే ముంబైకి తిరుగుండటం లేదు. ఇప్పటికే 583 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో దూసుకుపోతున్నాడు మిస్టర్ 360. భీకర ఫామ్‌లో ఉన్న అతడ్ని ఆపితే పంజాబ్‌కు సగం విజయం దక్కినట్లే.

ప్రభుసిమ్రన్ సింగ్

పంజాబ్ ఓపెనర్ ప్రభుసిమ్రన్ సూపర్ టచ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో 486 పరుగులు బాదిన అతడు.. ఈ పోరుతో పాటు ప్లేఆఫ్స్‌లోనూ సత్తా చాటి టీమ్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ప్రియాన్ష్ ఆర్యతో కలసి శుభారంభాలు అందిస్తున్న ప్రభుసిమ్రన్ గానీ రాణిస్తే ముంబైకి ఇబ్బందులు ఎదురవుతాయి. అతడు తన బ్యాట్ పవర్ చూపిస్తాడేమో చూడాలి.

shreyas-iyer.jpg


ఇవీ చదవండి:

బోటు బోల్తా.. సముద్రంలో దాదా ఫ్యామిలీ

రహానె సంచలన వ్యాఖ్యలు.. అలా అనేశాడేంటి..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 06:12 PM