IPL 2025 Venues: ఐపీఎల్ మ్యాచ్ వేదికల్లో మార్పు.. ఫైనల్స్ అక్కడే! కారణం ఇదే..
ABN , Publish Date - May 20 , 2025 | 06:27 PM
క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్‌లోని ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచుల వేదికల్ని మార్చేశారు. వీటితో పాటు ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్ వెన్యూను కూడా చేంజ్ చేశారు. మరి.. వేదికల్ని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్-2025 క్రమంగా ఆఖరి అంకానికి చేరుకుంటోంది. ప్రతి జట్టు దాదాపుగా 12 మ్యాచులు ఆడాయి. ఈ వారంతో గ్రూప్ దశ నుంచి ప్లేఆఫ్స్‌కు టర్న్ తీసుకోనుంది క్యాష్ రిచ్ లీగ్. ఈ తరుణంలో వేదికలపై క్లారిటీ ఇచ్చింది భారత క్రికెట్ బోర్డు. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ వేదికలపై తేల్చేసింది. ముల్లాన్‌పూర్, అహ్మదాబాద్‌లో 4 ప్లేఆఫ్స్ మ్యాచులు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే 29న జరిగే క్వాలిఫయర్ 1, ఆ తర్వాతి రోజు జరిగే ఎలిమినేటర్ మ్యాచులకు ముల్లాన్‌పూర్ ఆతిథ్యం ఇవ్వనుందని బీసీసీఐ వెల్లడించింది. జూన్ 1న జరిగే క్వాలిఫయర్ 2తో పాటు జూన్ 3న జరిగే ఫైనల్ ఫైట్‌కు అహ్మదాబాద్ హోస్ట్‌గా వ్యవహరిస్తుందని ప్రకటించింది.
ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!
ప్లేఆఫ్స్, ఫినాలేతో పాటు లీగ్ దశలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్ వేదికనూ బీసీసీఐ మార్చేసింది. వర్షం ముప్పు ఉండటంతో ఈ పోరును బెంగళూరు నుంచి లక్నోకు తరలించింది బోర్డు. ఆరెంజ్ ఆర్మీతో మ్యాచ్ తర్వాత మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది ఆర్సీబీ. అందుకే ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ను కూడా అక్కడికి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి గ్రూప్ దశ మ్యాచుల ముగింపు సమయంలో ప్లేఆఫ్స్, ఫైనల్స్ వేదికలపై క్లారిటీ ఇవ్వడం మంచి విషయమే. పాత షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్, కోల్‌కతాలో ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచుల్ని ప్లాన్ చేసింది బీసీసీఐ. కానీ ఇండియా-పాకిస్థాన్ నడుమ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతను దృష్టిలో పెట్టుకొని వేదికల్ని మార్చేసింది బోర్డు. కాగా, సన్‌రైజర్స్ వైఫల్యంతో బాధలో ఉన్న ఫ్యాన్స్‌కు.. ప్లేఆఫ్స్ మ్యాచుల్ని హైదరాబాద్ నుంచి మరో సిటీకి మార్చడం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇవీ చదవండి:
దిగ్వేష్‌తో గొడవపై అభిషేక్ రియాక్షన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి