Share News

IND w vs SA w: ఫైనల్ ఫైర్.. కప్‌ను తొలిసారి ముద్దాడుతామా?

ABN , Publish Date - Nov 01 , 2025 | 05:44 PM

మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా నవంబర్ 2న సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీస్‌లో ఆసీస్‌పై చూపించిన దూకుడు పునరావృతమైతే భారత్ తొలిసారి ట్రోఫీని ముద్దాడే అవకాశం ఉంది. లారా వాల్వార్ట్, కాప్ వంటి సఫారీ స్టార్‌లను నిలువరించడమే కీలకం.

IND w vs SA w: ఫైనల్ ఫైర్.. కప్‌ను తొలిసారి ముద్దాడుతామా?
India vs South Africa

ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ 2 ఆదివారం.. ఈ తేదీని చరిత్ర గుర్తు పెట్టుకునేలా చేయాలంటే టీమిండియా విజృంభించాల్సిందే. ప్రత్యర్థి సవాల్ విసిరితే సై అంటూ కొదమసింహంలా విరుచుకుపడాల్సిందే. ఈ అవకాశం మళ్లీ వస్తుందో లేదో.. అనేలా పోరాడితేనే కప్‌ను ముద్దాడే అదృష్టం వరిస్తుంది. సెమీస్‌లో ఆసీస్‌పై చూపించిన తెగువను పునరావృతం చేస్తేనే.. మహిళల క్రికెట్ చరిత్రలో టీమిండియా తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది. కానీ.. బలమైన కంగారూలనే భయపెట్టామనే అత్యుత్సాహం మొదలైతే.. పతనం ప్రారంభమైనట్లే.


మహిళల వన్డే ప్రపంచ కప్ 2025(Women’s World Cup 2025) తుది అంకానికి చేరుకుంది. టీమిండియా తొలిసారి కప్‌ను సగర్వంగా అందుకోవాలని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే భారత్‌తో తలపడనున్న సఫారీ సేన(India vs South Africa Final) కూడా ఇప్పటి వరకు ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ను ఒక్కసారి కూడా అందుకోలేదు. టీమిండియా గెలిచినా.. ఓడినా.. ఈ సారి కొత్త ఛాంపియన్ అవతరించనుంది. దీంతో తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి.


సఫారీలను సెట్ చేస్తే..

సౌతాఫ్రికా జట్టు ప్రధాన బలం కెప్టెన్ లారా వాల్వార్ట్(Laura Wolvaardt). ఈ వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానం ఆమెదే. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై ఏకంగా 169 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడింది. మొత్తంగా 8 మ్యాచ్‌లు ఆడిన లారా.. 470 పరుగులు చేసింది. ఆమెను కట్టడి చేయగలిగితే మిగతా వారిని అడ్డుకోవడం సులువు అవుతుంది. ఈ ట్రోఫీలో టీమిండియా-సౌతాఫ్రికా జట్లు ఒకసారి తలపడ్డాయి. ఇందులో సఫారీ జట్టే విజయాన్ని సాధించింది. గ్రూప్‌ స్టేజ్‌లో ఓడిపోయినా ఇప్పటికైతే నష్టం కలగలేదు. కానీ, ఫైనల్‌లో మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయకూడదు. ఇక్కడ ట్రోఫీనే కోల్పోవాల్సి వస్తుంది. నదినె డి క్లార్క్, ట్రైయన్ కూడా డేంజరేస్ బ్యాటర్లే. అందుకే రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్ టాప్ ఆర్డర్ పని పడితే.. స్పిన్నర్లు శ్రీ చరణి, దీప్తి శర్మ, రాధ యాదవ్ మిగతా బ్యాటర్లను ఔట్ చేసే పనిలో ఉండాలి.


‘కాప్’తో కష్టమే..

సౌతాఫ్రికాను ఏ విధంగానూ తక్కువ అంచనా వేయడానికి లేదు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సమర్థంగా రాణించగలిగే ప్లేయర్లు ఉన్నారు. ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన పేసర్ కాప్(Marizanne Kapp). చురకత్తుల్లాంటి బంతులను సంధిస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. అత్యంత బలమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ కకావికలం చేయడంలో ‘కాప్’దే కీలక పాత్ర. ఆమెతో పాటు ఖాఖా కూడా చాలా డేంజర్. వీరిద్దరితో టీమిండియా కాస్త చూసుకుని జాగ్రత్తగా ఆడాల్సిందే.


టీమిండియా బలమిదే..

స్మృతి మంధాన, జెమీమా, హర్మన్, రిచా, దీప్తి శర్మ.. టీమిండియా బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. ప్రపంచ కప్‌లోకి అనూహ్యంగా అడుగుపెట్టిన షెఫాలీ వర్మ పెద్దగా రాణించకపోయినా.. ఆమె దూకుడు మాత్రం అద్భుతం. కాప్, ఖాఖా బౌలింగ్‌ను స్మృతితో కలిసి షెఫాలీ ఎలా ఎదుర్కొంటునేదే ప్రశ్న. ఆఖర్లో రిచా ఘోష్ మెరిస్తే తిరుగుండదు. సఫారీల బౌలింగ్ ఎటాక్‌ను భారత బ్యాటర్లు పంచుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయం సాధించొచ్చు. మరి టీమిండియా తన కలను నెరవేర్చుకుంటుందా? తొలిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడుతుందా? మహిళల క్రికెట్ చరిత్రలో తమ పేరు లిఖించుకుంటుందా? చూడాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Bopanna Retirement: రిటైర్‌మెంట్ ప్రకటించిన బోపన్న

Rodrigues: నా కోసం వికెట్ త్యాగం చేసింది: జెమీమా

Updated Date - Nov 01 , 2025 | 05:44 PM