Rodrigues: నా కోసం వికెట్ త్యాగం చేసింది: జెమీమా
ABN , Publish Date - Nov 01 , 2025 | 04:17 PM
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లో ఆసీస్‌పై టీమిండియా సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. జెమీమా రోడ్రిగ్స్(127*) అద్భుతమైన నాక్‌తో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్ అయ్యాక జెమీమా డ్రెస్సింగ్ రూంలో చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీస్(Women’s World Cup Semifinal)లో ఆసీస్‌పై టీమిండియా సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. జెమీమా రోడ్రిగ్స్(127*) అద్భుతమైన నాక్‌తో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది. హర్మన్‌ప్రీత్ కౌర్(89) ఔటైనా.. చివరి వరకు క్రీజులో ఉండి భారీ లక్ష్యాన్ని ఛేదించి జట్టును ఫైనల్‌కు చేర్చింది. జమీమా ఆఖరి పరుగు తీశాక మొదలైన కన్నీళ్లు అరగంట అయినా ఆగలేదు. జెమీమా(Jemimah Rodrigues) మైదానం అంతా కలియతిరుగుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
మ్యాచ్ అయ్యాక జెమీమా డ్రెస్సింగ్ రూంలో చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. ‘నేను 85 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఉన్నా.. అప్పటికే చాలా అలసిపోయా. దీంతో క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(Deepti Sharma)కు ఒకటే చెప్పా. ‘ప్లీజ్ దీపు.. నాతో మాట్లాడుతూనే ఉండు. లేకపోతే నేను స్కోర్ చేయలేను’ అని అడిగా. అప్పటి నుంచి ప్రతి బంతికి దీప్తి వచ్చి నాతో మాట్లాడేది. నన్ను ఉత్సాహపరిచేది. నా పరుగు కోసం తన వికెట్‌ను కూడా త్యాగం చేసింది. పెవిలియన్‌కు వెళ్తూ కూడా ‘ఏం కంగారు వద్దు. నువ్వు మ్యాచ్‌ను ఫినిష్ చేయాలి’ అని చెప్పింది. ఇలాంటి భాగస్వాములు లేకపోతే భారీ లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టం. దీప్తి, రిచా, అమన్ ఆఖర్లో ఆడిన ఇన్నింగ్స్ కూడా చాలా కీలకం. హర్మన్‌తో కలిసి గొప్ప భాగస్వామ్యం నిర్మించడం బాగుంది. గతంలో వికెట్లు పడిపోయే కొద్దీ మ్యాచ్‌ను చేజార్చుకొనేవాళ్లం. ఇప్పుడు టీమిండియా మారిపోయిందని నిరూపించాం’ అని జెమీమా తెలిపింది.
అప్పటి వరకు విశ్రమించకూడదు..
‘ఆస్ట్రేలియాపై సెమీస్‌లో విజయం సాధించాం. అయితే ఇక్కడితో మన పని పూర్తి కాలేదు. మరో మ్యాచ్‌లో విజృంభించాలి. అప్పుడే సగర్వంగా టైటిల్‌ను అందుకోగలం. అప్పటి వరకు మనం విశ్రమించకూడదు’ అని జెమీమా వెల్లడించింది. కాగా నవీ ముంబై వేదికగా మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో టీమిండియా ఆదివారం సౌతాఫ్రికాతో తలపడనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Women WC 2025: ఫైనల్ రద్దయితే!
Smriti Mandhana: RCBకి స్మృతి మంధాన గుడ్‌బై?