Share News

Bopanna Retirement: రిటైర్‌మెంట్ ప్రకటించిన బోపన్న

ABN , Publish Date - Nov 01 , 2025 | 03:03 PM

భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న తన ఆటకు శనివారం రిటైర్‌మెంట్ ప్రకటించాడు. తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా టెన్నిస్‌లో తన ప్రయాణం గురించి స్మరించుకున్నాడు.

Bopanna Retirement: రిటైర్‌మెంట్ ప్రకటించిన బోపన్న
Rohan Bopanna Retirement

ఇంటర్నెట్ డెస్క్: భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న(Rohan Bopanna) తన ఆటకు శనివారం రిటైర్‌మెంట్ ప్రకటించాడు. తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా టెన్నిస్‌లో తన ప్రయాణం గురించి స్మరించుకున్నాడు.


‘నా జీవితానికే అర్థం చెప్పిన టెన్నిస్‌కు వీడ్కోలు(Bopanna Retirement) పలకడం చాలా కష్టంగా ఉంది. 20 ఏళ్ల సుమధురమైన సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. ఇప్పుడు రాకెట్‌ను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చింది. నా ఆటను పదును పెట్టడానికి కూర్గ్‌లో చెక్కలు నరికి సాధన చేసిన నాటి నుంచి, ప్రపంచంలోనే పెద్ద స్టేడియాల్లో వెలుగుల కింద ఆడిన వరకు.. ఇది అంతా ఓ కలలా అనిపిస్తోంది. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలోనే నాకు దక్కిన పెద్ద గౌరవం’ అని బోపన్న వ్యాఖ్యానించాడు.


ఈ కథ ఇక్కడితో ముగియదు..

‘పల్లెల్లోని ప్రతిభావంతులైన యువతకు స్ఫూర్తి నింపడమే నా తర్వాతి లక్ష్యం. ఎంత ఎదిగినా మన మూలాలను మరవద్దు. ఎక్కడ మొదలు పెట్టామని కాదు.. మన అనుభవం ఎంత వరకు విస్తరిస్తుందనే దానిపై పరిమితులను మనమే నిర్ణయించుకోవాలి. నమ్మకం, కష్టపడి పని చేయడం, అభిరుచి.. ఇవి ఉంటే ఏదైనా సాధ్యమే. ఈ ఆట నాకు అన్నీ ఇచ్చింది. ఇప్పుడు దానికి నేను తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఇది గుడ్‌బై కాదు. నన్ను తీర్చిదిద్దిన, నమ్మిన, నన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అందరూ నా ప్రయాణంలో భాగం.. నాలో భాగం’ అని బోపన్న రాసుకొచ్చారు.


చివరి మ్యాచ్ ఎక్కడంటే?

2017లో ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గాబ్రియేలా డాబ్రోవ్‌స్కీతో కలిసి గెలిచిన బోప్పన్న.. 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో మాథ్యూ ఎబ్డెన్‌తో జతకట్టి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆ టైటిల్ అనంతరం 43 ఏళ్ల వయసులోనే ప్రపంచ నంబర్‌ 1 డబుల్స్ ప్లేయర్‌గా నిలిచాడు. బోప్పన్న చివరి సారిగా పారిస్ మాస్టర్స్ 1000 టోర్నీలో అలెగ్జాండర్ బుబ్లిక్‌తో జతకట్టి ఆడారు. తన కెరీర్‌లో అనేక ATP టైటిల్స్ గెలుచుకున్న ఆయన.. డేవిస్ కప్‌, ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Women WC 2025: ఫైనల్ రద్దయితే!

Smriti Mandhana: RCBకి స్మృతి మంధాన గుడ్‌బై?

Updated Date - Nov 01 , 2025 | 03:03 PM