Share News

Rishabh Pant: ధోని సరసన పంత్.. ఒక్క మ్యాచ్‌తో ఎన్నో రికార్డులు!

ABN , Publish Date - Jun 22 , 2025 | 04:30 PM

టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని సరసన అతడు చోటు సంపాదించాడు.

Rishabh Pant: ధోని సరసన పంత్.. ఒక్క మ్యాచ్‌తో ఎన్నో రికార్డులు!
Rishabh Pant

టీమిండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న లీడ్స్ టెస్ట్‌లో అతడు చాలా రికార్డులను తిరగరాశాడు. బ్యాటింగ్‌లో అద్భుతమైన సెంచరీతో పలు పాత రికార్డులకు అతడు పాతర వేశాడు. ఇప్పుడు వికెట్ కీపింగ్‌లో అతడు అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ సమయంలో సెంచరీ హీరో ఓలీ పోప్ (106) ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ల వెనుక చక్కగా ఒడిసి పట్టుకున్నాడు. ఇది టెస్టుల్లో పంత్‌కు 150వ క్యాచ్ కావడం విశేషం. తద్వారా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని సరసన చోటు దక్కించున్నాడు రిషబ్.


దిగ్గజాల సరసన..

టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని (256 క్యాచులు) అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి తర్వాతి స్థానంలో వెటరన్ కీపర్ సయ్యద్ కిర్మాణీ (160 క్యాచులు) ఉన్నాడు. మూడో స్థానంలో పంత్ (150 క్యాచులు) నిలిచాడు. 150 లేదా అంతకంటే ఎక్కువ క్యాచులు అందుకున్న టీమిండియా వికెట్ కీపర్లలో ధోని, కిర్మాణీ సరసన రిషబ్ చోటు దక్కించుకున్నాడు. పంత్ తర్వాతి స్థానాల్లో కిరణ్ మోరే (110 క్యాచులు), నయన్ మోంగియా (99 క్యాచులు) ఉన్నారు. ఇదే ఫామ్‌ను వచ్చే కొన్నేళ్ల పాటు కొనసాగిస్తే అత్యధిక క్యాచుల విషయంలో మాహీని ధోని మించిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.


పాత రికార్డులకు పాతర..

లీడ్స్ టెస్టులో పలు పాత రికార్డులను చెరిపేశాడు పంత్. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (56 సిక్సులు)ను రిషబ్ (58 సిక్సులు) దాటేశాడు. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సులు బాదిన భారత బ్యాటర్ల జాబితాలో రోహిత్‌ను దాటేశాడు పంత్. అంతేగాక డబ్ల్యూటీసీ ఓవరాల్‌ సిక్సుల విషయంలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 83 సిక్సులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలో పంత్ (58 సిక్సులు) నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పంత్ మరో అరుదైన ఘనత కూడా అందుకున్నాడు. సేనా దేశాలుగా పిలిచే సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన ఆసియా వికెట్ కీపర్-బ్యాటర్‌గా టీమిండియా వైస్ కెప్టెన్ నిలిచాడు. సేనా దేశాల్లో 27 మ్యాచుల్లో 1731 పరుగులు చేశాడు పంత్. భారత దిగ్గజం ధోని (32 మ్యాచుల్లో 1731 పరుగులు)ను అతడు అధిగమించాడు.


ఇవీ చదవండి:

నాడు స్టుపిడ్‌ నేడు సూపర్బ్‌

గుకేష్‌ను దాటేసిన ప్రజ్ఞానంద

అప్పుడు వాళ్లు ఇప్పుడు వీళ్లు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 04:46 PM