Share News

Harmanpreet: గురుభక్తి చాటుకున్న హర్మన్

ABN , Publish Date - Nov 03 , 2025 | 05:22 PM

టీమిండియా ప్లేయర్లు అందరూ తమ సంబరాల్లో మునిగి ఉంటే.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం గురుభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. తనను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్‌కు పాదాభివందనం చేసింది.

Harmanpreet: గురుభక్తి చాటుకున్న హర్మన్
Harmanpreet

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా జట్టు విశ్వవిజేతగా నిలిచింది. చిరకాల స్వప్నాన్ని పోరాడి మరీ నెరవేర్చుకుంది. ఆనంద భాష్పాలు ఓ వైపు.. 47 ఏళ్ల నిరీక్షణకు తెర దిగిన మధురమైన క్షణం మరో వైపు.. కన్నీళ్లతో ప్లేయర్ల కడుపు నిండింది. ఇంత మధురమైన క్షణాల నడుమ.. ఓ ఆసక్తికరమైన సంఘటన.


సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో టీమిండియా(India Women World Cup 2025) విజయం సాధించింది. ప్లేయర్లు అందరూ తమ సంబరాల్లో మునిగి ఉంటే.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet) మాత్రం గురుభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. తనను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్‌(Amol Muzumdar)కు పాదాభివందనం చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్(viral photo) అవుతోంది. హర్మన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గురువుపై ఆమెకు ఉన్న గౌరవాన్ని కొనియాడుతున్నారు.


అమోల్.. ఓ ఛాంపియన్!

అమోల్ మజుందార్ భారత మహిళా జట్టు ప్రధాన కోచ్. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భారత జెర్సీ ధరించలేదు. కానీ స్టార్ ప్లేయర్లు కూడా పొందలేని అనుభూతి ఆయనకు దక్కింది. తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను 1993లో ముంబై జట్టుతో ప్రారంభించాడు. రెండు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌లో అమోల్ మజుందార్ 171 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 11వేల పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. కానీ టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. రంజీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చినా.. భారత జట్టులో అవకాశం రాలేదు. దీంతో 2014లో ఆటకు వీడ్కోలు పలికి కోచింగ్ వైపు మొగ్గు చూపాడు. ఆయన తన కెరీర్‌లో నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లతో కలిసి పనిచేశాడు. అక్టోబర్ 2023లో ఆయన భారత మహిళా జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ఆ సమయంలో దేశం తరపున ఎప్పుడూ ఆడని వ్యక్తి కోచ్ ఎలా అవుతాడని చాలా మంది ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి సమాధానం.. ప్రపంచ కప్‌ను ముద్దాడుతూ చూపించాడు.


ఈ వార్తలు కూడా చదవండి:

Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా

Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!

Updated Date - Nov 03 , 2025 | 05:30 PM