Brendon McCullum On Edgbaston Loss: మమ్మల్ని అతడే ఓడించాడు.. ఇంగ్లండ్ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ABN , Publish Date - Jul 07 , 2025 | 10:01 AM
ఇంగ్లండ్ జట్టును బిత్తరపోయేలా చేసింది భారత్. ఆ జట్టు గర్వాన్ని అణచడమే గాక ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఓడించింది గిల్ సేన. దీనిపై ఇంగ్లీష్ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్పందించాడు.
బజ్‌బాల్‌తో టెస్టుల్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ వస్తోంది ఇంగ్లండ్ జట్టు. ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదిస్తూ మూడ్నాలుగు రోజుల్లోనే మ్యాచులను ముగించేస్తూ బెంబేలెత్తిస్తోంది. ఒకవేళ ఐదో రోజు వరకు ఆట వెళ్లినా విజయంతో గానీ వెనుదిరగడం లేదు. అలాంటి టీమ్‌కు ఓటమి ఎలా ఉంటుందో పరిచయం చేసింది గిల్ సేన. ఆతిథ్య జట్టుకు పెట్టని కోటగా ఉన్న ఎడ్జ్‌బాస్టన్‌లో 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది భారత్. ఇంగ్లీష్ టీమ్ అహంకారాన్ని అణచింది. మళ్లీ నోరెత్తకుండా చేసింది మెన్ ఇన్ బ్లూ. ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రత్యర్థి జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
అంతా మార్చేశాడు..
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఆకాశ్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని.. ఈ పిచ్‌పై అతడు సంధించిన బంతులే ఫలితాన్ని శాసించాయని అన్నాడు మెకల్లమ్. ‘మ్యాచ్ సాగుతున్న కొద్దీ టాస్ దగ్గరే మేం అవకాశాన్ని కోల్పోయామని అర్థమైంది. వికెట్ ఇలా ప్రవర్తిస్తుందని అనుకోలేదు. భారత్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయలేకపోయాం. 580కి పైగా పరుగులు చేస్తుందని ఊహించలేదు. అక్కడే మేం ఆటలో వెనుకబడ్డాం. జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ భాగస్వామ్యం వల్ల గేమ్‌లో కొంతమేర సమతూకం తీసుకురాగలిగాం. కానీ ఆకాశ్‌దీప్ ఆట గమనాన్ని మార్చేసింది’ అంటూ మెచ్చుకున్నాడు మెకల్లమ్.

బుమ్రా తప్పక వస్తాడు..
ఆకాశ్‌దీప్ పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు బ్రెండన్ మెకల్లమ్. లార్డ్స్ వేదికగా జరిగే తర్వాతి టెస్ట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఆడతాడనే విషయం తమకు తెలుసునని.. కాబట్టి ఆ మ్యాచ్‌కు అన్ని విధాలుగా సన్నద్ధం అవుతామని స్పష్టం చేశాడు ఇంగ్లండ్ కోచ్. ఎడ్జ్‌బాస్టన్ వికెట్‌తో పోలిస్తే లార్డ్స్ పిచ్ స్పందించే తీరు విభిన్నంగా ఉంటుందని ఆశిస్తున్నామని తెలిపాడు మెకల్లమ్.
ఇవీ చదవండి:
సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్ చూశారా..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి