Shubman Gill Favourite Journalist: నా ఫేవరెట్ జర్నలిస్ట్ ఎక్కడ.. గిల్ కామెంట్‌కు నవ్వాగదు!
ABN , Publish Date - Jul 07 , 2025 | 08:54 AM
ఎడ్జ్‌బాస్టన్ విజయంతో విమర్శకులకు ఇచ్చిపడేశాడు టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్. నా ఫేవరెట్ జర్నలిస్ట్ ఎక్కడ అంటూ కౌంటర్ ఇచ్చాడు.
టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌కు పెట్టని కోటగా ఉన్న ఎడ్జ్‌బాస్టన్‌లో విజయం సాధించింది భారత్. స్టోక్స్ సేన అహంకారాన్ని అణచింది. రెండో టెస్ట్‌లో ఏకంగా 336 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. విదేశాల్లో భారత్ అందుకున్న అతిపెద్ద విజయంగా ఇది నిలిచింది. సేనా దేశాల్లో 30 టెస్టులు నెగ్గిన తొలి ఆసియా జట్టుగా మరో రికార్డు సాధించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో గెలిచిన మొదటి ఆసియా టీమ్‌గా మరో ఘనత అందుకుంది. ఇలా ఎన్నో అరుదైన రికార్డులు అందుకొని అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తింది. ఈ తరుణంలో మీడియా ముందుకు వచ్చిన కెప్టెన్ గిల్.. విమర్శకులకు ఇచ్చిపడేశాడు. ఫేవరెట్ జర్నలిస్ట్ ఎక్కడ అంటూ గట్టి సెటైర్ వేశాడు.
రికార్డులను పట్టించుకోను..
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ ముగిశాక నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న గిల్.. నా ఫేవరెట్ జర్నలిస్ట్ ఎక్కడ అంటూ జోక్ చేశాడు. ‘నా ఫేవరెట్ జర్నలిస్ట్ కనిపించడం లేదు. అతడు ఎక్కడ? అతడ్ని చూడాలని అనుకున్నా. కానీ కనిపించడం లేదు. ఈ మ్యాచ్ మొదలవడానికి ముందు కూడా చెప్పా. నేను రికార్డులను అంతగా పట్టించుకోను. ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన బెస్ట్ ఇండియా టీమ్ ఇదే అని నేను నమ్మా. మా శాయశక్తులా ప్రయత్నిస్తే ఏదైనా చేయగలమని భావించా. సిరీస్ గెలించేందుకు ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ, పోరాడుతూ ఉంటే ఈ సిరీస్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా మలచుకోగలం అనేది మా ప్లాన్’ అని గిల్ చెప్పుకొచ్చాడు.
నవ్వుతూనే..
ఇంగ్లండ్ టూర్‌ను భారత్ పేలవంగా ప్రారంభించింది. లీడ్స్ టెస్ట్‌లో పోరాడినా ఓటమి తప్పలేదు. బౌలర్ల వైఫల్యం జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీంతో ఎడ్జ్‌బాస్టన్‌లోనూ గిల్ సేనకు ఓటమి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పైగా అక్కడ కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలిచిన రికార్డు మనకు లేదు. దీంతో విమర్శకులు టీమిండియాను టార్గెట్ చేశారు. అదే సమయంలో ఈ మ్యాచ్‌కు ముందు కొందరు జర్నలిస్టులు ఎడ్జ్‌బాస్టన్‌లో మీ రికార్డులు పేలవం, గెలుపు కోసం వ్యూహాలు ఏంటి అంటూ గిల్‌ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ తర్వాత ఆ జర్నలిస్ట్ ఎక్కడ అంటూ జోక్ వేసిన గిల్.. నవ్వుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
ఇవీ చదవండి:
సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్ చూశారా..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి