BCCI IPL 2025: బీసీసీఐకి సెల్యూట్.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి!
ABN , Publish Date - May 31 , 2025 | 05:38 PM
భారత క్రికెట్ బోర్డు అనవసరంగా తొందర పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాస్త అటు ఇటైనా బోర్డు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే కామెంట్స్ వినిపించాయి. ఇది తప్పు అంటూ కొందరు బోర్డును ఏకిపారేశారు. అయితే అవే నోళ్లు ఇప్పుడు బీసీసీఐని మెచ్చుకుంటున్నాయి.
ఐపీఎల్-2025 ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. ప్లేఆఫ్స్ మ్యాచులు దాదాపుగా ముగింపునకు చేరుకున్నాయి. పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగే క్వాలిఫయర్-2తో అందరి ఫోకస్ ఫైనల్ మ్యాచ్ మీదకు షిఫ్ట్ కానుంది. అయితే కొన్ని రోజుల కింద వరకు క్యాష్ రిచ్ లీగ్ రీస్టార్ట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. భారత్-పాకిస్థాన్ నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఐపీఎల్ మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. అర్ధాంతరంగా నిలిచిపోయిన సీజన్ మళ్లీ పట్టాలెక్కడం కష్టమేనని అంతా అనుకున్నారు. ఇండో-పాక్ ఉద్రిక్తతల కారణంగా విదేశీ ప్లేయర్లు సొంతూళ్లకు కూడా వెళ్లిపోయారు. అయితే చక్రం తిప్పిన బీసీసీఐ.. ఏం అనుకుందో అది సాధించి చూపించింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
ఫ్రాంచైజీలతో కలసి..
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గవని చాలా మంది భావించారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పుకున్నా.. కొన్నాళ్ల పాటు పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాదని భావించారు. అందుకే మెజారిటీ స్పోర్టింగ్ ఈవెంట్స్ వాయిదా వేశారు. అయితే బీసీసీఐ మాత్రం భారీ ముందడుగు వేసింది. ఎలాగైనా ఐపీఎల్‌ను రీస్టార్ట్ చేయాలని నిర్ణయించింది. టోర్నీ నిర్వహణ, భద్రతపై కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రంగంలోకి దిగింది. ఫ్రాంచైజీలతో కలసి ప్లానింగ్ చేయడమే గాక అమలు చేయడం మొదలుపెట్టింది. విదేశీ స్టార్లను తిరిగి భారత్‌కు రప్పించింది. మ్యాచుల కోసం స్టేడియాలను శరవేగంగా సిద్ధం చేసింది.
ఎన్ని విమర్శలు వచ్చినా..
భారత్-పాక్ మధ్య మళ్లీ యుద్ధం మొదలవదనే గ్యారెంటీ లేదు. ఈ నేపథ్యంలో ఇంత హడావుడిగా ఎందుకు టోర్నీని రీస్టార్ట్ చేస్తున్నారంటూ బీసీసీఐ మీద విమర్శలు వచ్చాయి. ఒకవేళ మళ్లీ వార్ షురూ అయినా.. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినా పరిస్థితి ఏంటంటూ బోర్డు మీద అనేక మంది మండిపడ్డారు. క్రికెట్ వరల్డ్‌లో మన పరువు పోవడం ఖాయమంటూ బీసీసీఐని హెచ్చరించారు. తొందరపాటుతో ఏం సాధించలేరంటూ బోర్డును ఏకిపారేశారు. అయితే ఏవీ పట్టించుకోని బోర్డు.. ప్రతిదీ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోయింది. కట్ చేస్తే.. ఐపీఎల్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఇంకో 2 మ్యాచులతో సీజన్‌కు గుమ్మడికాయ కొట్టేయొచ్చు. ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకలకు భారత త్రివిధ దళాధిపతులు కూడా వస్తున్నారు. దీంతో వాటే సక్సెస్ అంటూ అప్పుడు తిట్టిన నోళ్లే ఇప్పుడు బీసీసీఐని మెచ్చుకుంటున్నాయి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి