Jasprit Bumrah: ఒకే ఒక్కడు.. బుమ్రా వికెట్ల ‘సెంచరీ’!
ABN , Publish Date - Dec 10 , 2025 | 09:23 AM
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ బుమ్రా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. మూడు ఫార్మాట్లలో వంద వికెట్లు తీసుకున్న తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో కటక్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన భారత్ ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రీఎంట్రీలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ధనాధన్ నాక్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ సేన.. 74 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఏకంగా 101 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ కనీసం వంద వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే టెస్టులు, వన్డేల్లో ఈ ఘనత సాధించిన బుమ్రా.. కటక్ టీ20లో రెండు వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ అందుకున్నాడు.దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్లో బ్రెవిస్‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అదే ఓవర్లో అతను మరో వికెట్ కూడా తీశాడు. బుమ్రాకిది 81వ టీ20 మ్యాచ్. 52 టెస్టులాడి 234 వికెట్లు తీసిన బుమ్రా.. 89 వన్డేల్లో 149 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్ (69 మ్యాచ్‌ల్లో 107 వికెట్లు) టీ20ల్లో వంద వికెట్లు తీసిన తొలి భారత బౌలర్.
అర్ష్‌దీప్ రియాక్షన్..
టీ20 ఫార్మాట్‌లో బుమ్రా కంటే ముందే యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) వంద వికెట్ల ఘనత సాధించాడు. ఇప్పుడు ఈ క్లబ్‌లో బుమ్రా చేరడంతో అర్ష్‌దీప్ హర్షం వ్యక్తం చేశాడు. ‘బుమ్రా కూడా 100 వికెట్ల క్లబ్‌లో చేరడం చాలా గొప్పగా అనిపిస్తోంది. అతను వందో వికెట్ సాధించగానే దగ్గరికి వెళ్లి అభినందించా. బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడం ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. బౌలర్లందరూ వికెట్లు తీస్తే అప్పుడు కెప్టెన్ పని సులభం అవుతుంది. బుమ్రా లేదా నాతో పవర్ ప్లేలో మూడు ఓవర్లు వేయించాలని కోరుకున్నప్పుడల్లా మేం కెప్టెన్‌కి వీలైనంత ఎక్కువ సౌలభ్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం’ అని అర్ష్‌దీప్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.
ఇవీ చదవండి:
Hardik Pandya: ఫొటో గ్రాఫర్లపై హార్దిక్ పాండ్య అసహనం.. ఎందుకంటే.?