The Ashes: మా కల చెదిరిపోయింది.. బెన్ స్టోక్స్ ఎమోషనల్ వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:34 PM
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 82 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. దీంతో 3-0 తేడాతో ఈ సిరీస్‌ను ఆసీస్ దక్కించుకుంది. జట్టు ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జయభేరి మోగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన కంగారూలు.. అడిలైడ్‌లో జరిగిన మూడో టెస్టులోనూ విజయకేతనం ఎగరవేశారు. ఇంగ్లండ్‌ను 82 పరుగుల తేడాతో ఓడించి రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. 435 పరుగుల లక్ష్యఛేదనలో.. 207/6తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 352 పరుగులకు ఆలౌటైంది. జట్టు ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.
‘సిరీస్‌ను ఎలాగైనా కాపాడుకోవాలనే లక్ష్యంతోనే అడిలైడ్‌లో అడుగుపెట్టాం. కానీ మా కల చెదిరిపోయింది. ఈ ఓటమి జట్టులోని ప్రతి ఒక్కరిని ఎంతో బాధకు గురి చేస్తోంది. అందరూ చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. ఆస్ట్రేలియాకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. గెలుపు అనేది మూడు విభాగాల్లో రాణించడంపై ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. వారు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ మాపై పైచేయి సాధించారు.
నాలుగో ఇన్నింగ్స్‌లో మా ముందు భారీ లక్ష్యం ఉన్నప్పటికీ మేం ఆఖరి వరకు పోరాడాం. విల్ జాక్స్, జెమీ స్మిత్ అద్భుతంగా రాణించారు. మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టాస్ ఓడినప్పటికీ ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఓ మోస్తార్ స్కోర్‌కే కట్టడి చేయడంలో మేము విజయవంతమయ్యాము. అయితే ఆ తర్వాత మేము భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాము. రెండో ఇన్నింగ్స్‌లో కూడా కేవలం 60 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడగొట్టాము. మాకు చాలా సానుకూల ఆంశాలు ఉన్నాయి.
ముఖ్యంగా మా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చూపిన పోరాటపటిమ నిజంగా అద్బుతం. నేను ఆశించిన పట్టుదల వారిలో కనిపించింది. సిరీస్ కోల్పోయినప్పటికీ మిగిలిన రెండు టెస్టుల్లో విజయం సాధించించేందుకు ప్రయత్నిస్తాము’ అని స్టోక్స్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి:
ఇషాన్‌కు ఇది క్రికెట్ ఇచ్చిన గిఫ్ట్: అశ్విన్
చెలరేగిన సమీర్ మిన్హాస్.. భారత్ టార్గెట్ 348