Ashes 2025-26: ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం
ABN , Publish Date - Dec 07 , 2025 | 06:21 PM
సొంతగడ్డపై జరుగుతున్న యాషెస్ 2025-26 సిరీస్‌లో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో సత్తాచాటి వరుసగా రెండో విజయం సాధించింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కంగారూలు 8 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించారు.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్(Ashes) 2025-26లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై ఆసీస్ సూపర్ విక్టరీ సాధించింది. 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. ట్రావిస్ హెడ్ రెండో ఇన్నింగ్స్‌లో నిరాశపరిచినప్పటికీ.. జెక్ వెదర్‌ల్డ్ 17, స్టీవ్ స్మిత్ 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సునాయాసంగా ముగించారు.
అదరగొట్టిన రూట్..
బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. వెటరన్ బ్యాటర్ రూట్(Root) (206 బంతుల్లో 138) అద్భుతమైన శతకంతో చెలరేగాడు. అతడికి తోడు జాక్ క్రాలీ 76 పరుగులు, ఆఖరిలో జోఫ్రా ఆర్చర్( 38 పరుగులు) మెరుపులు మెరిపించడంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మరోసారి 6 వికెట్లతో నిప్పులు చెరిగాడు.
అనంతరం ఇంగ్లీష్ జట్టుకు ఆస్ట్రేలియా కూడా ధీటైన సమాధానమిచ్చింది. కంగారులు తమ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోర్ నమోదు చేశారు. స్టార్ మిచెల్ స్టార్క్ 77 పరుగులతో రాణించాడు. అలానే జెక్ వెదర్‌ల్డ్ (72), మార్నస్ లబుషేన్ (65) పరుగులు, స్టీవ్ స్మిత్(Steve Smith) (61), అలెక్స్ క్యారీ (63) అర్ధ సెంచరీలతో మెరిశారు. దీంతో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగుల ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లీష్ జట్టు ఫెయిల్:
ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్(England) బ్యాటర్లు తడబడ్డారు. 177 పరుగుల వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు కేవలం 241 పరుగులకే ఆలౌటైంది. జాక్ క్రాలీ(44), స్టోక్స్(50) రాణించినప్పటికి.. మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో ఆతిథ్య జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్ లో సూపర్ సెంచరీతో చెలరేగిన రూట్.. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 15 పరుగులకే ఔటయ్యాడు. ఆసీస్(Australia) బౌలర్లలో మైఖేల్ నేజర్ ఐదు వికెట్లను తీసి.. ఇంగ్లాండ్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. స్టార్క్, బోలాండ్ తలా రెండు వికెట్లు సాధించారు. 65 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి.. టార్గెట్ ను చేధించింది. ఇక ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా(Australia 2-0) దూసుకెళ్లింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఆడిలైడ్ వేదికగా డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Yashasvi Jaiswal: చివరి వన్డేలో శతకం తర్వాత జైస్వాల్ సంచలన నిర్ణయం
రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!