Ravi Shastri As England Coach: ఇంగ్లాండ్ హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి సరైనోడు.. మాజీ ప్లేయర్ కీలక కామెంట్స్
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:49 PM
యాషెస్ సిరీస్ 2025లో భాగంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఐదు టెస్టుల్లో ఇప్పటికే 3-0తో సిరీస్ ను ఆసీస్ కైవసం చేసుకుంది. దీంతో ఇంగ్లాండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లూ ఎక్కువగా వినిపిస్తోన్నాయి. ఈ విషయంపై ఇంగ్లిష్ జట్టు మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ కీలక కామెంట్స్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్ 2025లో భాగంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఐదు టెస్టుల్లో ఇప్పటికే 3-0తో సిరీస్ ను ఆసీస్ కైవసం చేసుకుంది. తమ దేశంలో ‘బజ్‌బాల్’ ఆటలు చెల్లవనే రీతిలో కంగారూలు.. స్టోక్స్ బృందానికి చెక్ పెట్టి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ట్రోఫీని తమ సొంతం చేసుకున్నారు. దీంతో యాషెస్ సిరీస్ లో విఫలమవుతున్న ఇంగ్లాండ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ (Brendon McCullum)ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లూ ఎక్కువగా వినిపిస్తోన్నాయి. ఈ విషయంపై ఇంగ్లిష్ జట్టు మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ కీలక కామెంట్స్ చేశారు. ఇంగ్లాండ్ కోచ్‌గా ఉన్న మెకల్లమ్ స్థానాన్ని భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri)తో భర్తీ చేయాలని ఇంగ్లాండ్ బోర్డుకు సూచించాడు.
ఇటీవల ఓ ప్రముఖ జర్నలిస్ట్ తో పనేసర్ ఇంటారక్షన్ జరిగింది. ఈ క్రమంలో ఆయన ఇంగ్లాండ్ జట్టు గురించి, యాషెస్ సిరీస్ గురించి పలు విషయాలను వెల్లడించాడు. ‘ఆస్ట్రేలియాను ఓడించగలిగే వ్యూహాలు రచించగల వ్యక్తి ఎవరో మీరు తెలుసుకోవాలి. కంగారుల బలహీనతలు, మానసికంగా, శారీరకంగా వారిని ఎదుర్కోవాలో తెలిసి ఉండాలి. వ్యూహాత్మకంగా వారిని దెబ్బకొట్టగలగాలి. ఇంగ్లాండ్ జట్టు తదుపరి హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి సరైన ఆప్షన్ అని నేను అభిప్రాయ పడుతున్నాను’ అని మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ తెలిపాడు.
ఇక రవిశాస్ర్తీ విషయానికి వస్తే.. భారత హెడ్‌కోచ్‌గా ఆయన టెస్టు జట్టును విజయపథంలో నడిపించాడు. అతడి ఆధ్వర్యంలో భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి, వరుసగా టెస్టు సిరీస్‌లు గెలిచింది. అలానే 2018-19, 2020-21 మధ్య కాలంలో ఆసీస్‌ను చిత్తు చేసి.. రెండుసార్లు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. ఈ ట్రాక్ రికార్డ్ ను ఆధారంగా చూసేకుని పనేసర్ పై వ్యాఖ్యలు చేశాడని పలువురు క్రీడా నిపుణులు అభిప్రాయా పడుతున్నారు. మరోవైపు న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ 2022లో ఇంగ్లాండ్ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 2025లో ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ హెడ్‌కోచ్‌గానూ మెకల్లమ్ బాధ్యతలు చేపట్టాడు. 2027 వరకు అతడికి కాంట్రాక్టు ఉంది.
అయితే, ఇంగ్లండ్ జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో 44 ఏళ్ల మెకల్లమ్‌ను పదవి నుంచి దించేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ప్రారంభంలో ‘బజ్‌బాల్’ అంటూ దూకుడైన విధానంతో స్టోక్స్ బృందంతో మెకల్లమ్ మెరుగైన ఫలితాలు రాబట్టాడు. కానీ ఇటీవలి కాలంలో ఇంగ్లీంష్ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శనలు ఇవ్వడంలో మునుపటి జోరు కొనసాగించలేకపోతోంది. ఇక యాషెస్ సిరీస్‌లో భాగంగా.. పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఇంగాండ్ ఓడింది. బ్రిస్బేన్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులోనూ ఇదే చేదు ఫలితాన్ని చవిచూసింది. అలానే అడిలైడ్ వేదికగా ముగిసిన మూడో టెస్టులోనూ ఆసీస్ చేతిలో 82 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. వరుసగా రెండోసారి సిరీస్‌ను కోల్పోయింది. ఇరుజట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు (డిసెంబరు 26-30)కు మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది.
ఇవీ చదవండి:
బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ
Rinku Singh Vijay Hazare Trophy: చెలరేగి ఆడిన రింకూ సింగ్..