Afghanistan vs Pakistan: చిన్న జట్టుపై పాకిస్తాన్ ఘోర ఓటమి.. నెటిజన్ల ట్రోల్స్..
ABN , Publish Date - Sep 03 , 2025 | 11:14 AM
షార్జా వేదికగా భారీ అంచనాల మధ్య జరిగిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ టీ20 మ్యాచులో ఆప్ఘాన్ అదరగొట్టింది. 18 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. ఓవైపు పాకిస్తాన్ ఆటగాళ్లు తడబడుతుంటే, ఆఫ్ఘనిస్థాన్ మాత్రం తమ ఆధిపత్యాన్ని చాటింది.
షార్జా మైదానంలో జరిగిన AFG vs PAK టీ20 మ్యాచ్‌లో ఆశ్చర్యకరంగా ఆఫ్ఘనిస్తాన్ 18 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. ఇది సాధారణ గెలుపు కాదు. ఆఫ్ఘాన్ దేశంలో భూకంపం వల్ల 1400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన బాధాకర పరిస్థితుల్లో ఆ దేశానికి ఇది ఊపిరి పీల్చుకునే విషయమని చెప్పవచ్చు.
మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ ఆరంభంలోనే ఓ వికెట్ కోల్పోయినా, తర్వాత ఇబ్రాహీం జద్రాన్ (65), సెదికుల్లా అటాల్ (64) అద్భుతంగా ఆడారు. వీరిద్దరి మధ్య 113 పరుగుల భాగస్వామ్యం లభించింది. టీ20ల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది రెండో అత్యధిక రెండో వికెట్ భాగస్వామ్యం. ఆ క్రమంలో చివరకు ఆఫ్ఘనిస్థాన్ జట్టు 169 పరుగులు చేసింది.
పాకిస్తాన్ బౌలింగ్ ఎలా ఉందంటే
ఫహీమ్ అష్రఫ్, సయీమ్ ఆయుబ్ మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అయినా ఆఫ్ఘనిస్థాన్ జట్టు 169 పరుగులు చేసింది. తడిగా ఉన్న పిచ్, డ్యూ కారణంగా ఇది డిఫెండ్ చేయడానికి తక్కువగా అనిపించింది.
తొలి జట్టులోనే దుమ్ము రేపిన స్పిన్
పాకిస్తాన్ ఛేజింగ్ ఆరంభించగానే ఫారూకీ సైమ్ ఆయుబ్‌ను గోల్డెన్ డక్‌కు అవుట్ చేశాడు. తర్వాత షాహిబ్ జాదా ఫర్హాన్ కూడా ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. ఇక బరిలోకి వచ్చిన ఫఖర్ జమాన్ ఒక దశలో కొంత హిట్ చేసినా, స్టేడియంలో ఆఫ్ఘన్ శిబిరమే సత్తా చాటింది. ఆ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లు ఆటను పూర్తిగా మార్చేశారు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోహమ్మద్ నబీ కలిసి పాకిస్తాన్ బ్యాటింగ్ తీరును కట్టడి చేశారు.
చివరకు మాత్రం..
ఆ క్రమంలో నూర్ అహ్మద్ మొదటి బంతికే వికెట్ తీశాడు. నబీ తన అనుభవంతో బంతులను చక్కగా మార్చాడు. రషీద్ తన స్పిన్ గైల్‌తో మిడిల్ ఆర్డర్‌ను కూల్చేశాడు. పాక్ 62/2 స్థితి నుంచి 82/6కు పడిపోయింది. ఆ తర్వాత మొత్తం 7 వికెట్లు 49 పరుగులకే కోల్పోయారు. చివర్లో హరిస్ రౌఫ్ 34 పరుగులు (16 బంతుల్లో) చేసి కొంత స్టాండ్ ఇచ్చాడు. కానీ అతని ఆట పాకిస్తాన్‌ను గెలుపు దాకా తీసుకెళ్లలేకపోయాడు. దీంతో మొత్తం టీం 151 పరుగులకే ఆలౌట్ అయింది.
ఆ క్రమంలో 18 పరుగుల తేడాతో ఆఫ్గాన్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ప్రపంచానికి తాము చిన్న జట్టు కాదని నిరూపించింది. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ జట్టుపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి