U19 Asia Cup 2025: 315 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
ABN , Publish Date - Dec 16 , 2025 | 06:47 PM
అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో యువ భారత్ 315 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు చేసింది. మలేషియా 93 పరుగులకే ఆలౌటైంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ ఆటగాడు అభిజ్ఞాన్ కుందు(Abhignaan Kundu) సెంచరీతో అండర్-19 ఆసియా కప్ 2025 (U19 Asia Cup 2025)లో మలేషియాను భారత్ చిత్తుగా ఓడించింది. ఇవాళ(మంగళవారం) మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో యువ భారత్ 315 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 408 పరుగుల భారీ స్కోరు చేసింది.
భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన మలేషియా(Malaysia U19) 93 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో హంజా పంగి (35) టాప్ స్కోరర్. డీయాజ్ పాత్రో 13, ముహద్ అఫినిద్ 12 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ ఐదు వికెట్లు తీసి.. మలేషియా పతనాన్ని శాసించాడు. ఉదవ్ మోహన్ 2, కిషన్ కుమార్ సింగ్, ఖాలాన్ పటేల్, కాన్షిక్ చౌహాన్ ఒక్కో వికెట్ సాధించారు.
భారత బ్యాటర్లలో ఐదో స్థానంలో వచ్చిన 17 ఏళ్ల అభిజ్ఞాన్ కుందు (209*; 125 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో మలేషియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిర్ణీత 50 ఓవర్లు పూర్తి కావడంతో తృటిలో ప్రపంచ రికార్డ్ స్కోర్(215)ను కుందు మిస్సయ్యాడు. ఇక మిగిలిన భారత్ బ్యాటర్లలో వేదాంత్ త్రివేది (90), వైభవ్ సూర్యవంశీ (50) రాణించారు. కెప్టెన్ ఆయుష్ మాత్రే (14), కాన్షిక్ చౌహాన్ (14), విహాన్ మల్హోత్రా (7), హర్వంశ్ పంగాలియా (5), ఖిలాన్ పటేల్ (2) విఫలమయ్యారు. మలేషియా బౌలర్లలో మహ్మద్ అక్రమ్ 5, ఎన్.సత్నకుమారన్, జాశ్విన్ కృష్ణమూర్తి తలో వికెట్ తీసుకున్నారు. డబుల్ సెంచరీ చేసిన అభిజ్ఞాన్ కుందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కింది. అండర్-19 ఆసియా కప్ 2025 టోర్నీలోని గ్రూప్-ఏ టేబుల్ పట్టిక(Group A Points Table)లో భారత్ 3 విజయాలతో టాప్ ప్లేస్‌లో ఉంది.
ఇవి కూడా చదవండి:
Abhijnaan Kundu: అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ.. తొలి ప్లేయర్‌గా రికార్డ్
వైభవ్ సూర్యవంశీని కట్టడి చేస్తాం: మలేసియా కెప్టెన్ డియాజ్