Sridhar Vembu: భారత్‌కు తిరిగొచ్చేయండి.. ఎన్నారైలకు శ్రీధర్ వెంబు అభ్యర్థన
ABN , Publish Date - Oct 26 , 2025 | 02:34 PM
ఎన్నారైలు భారత్‌కు తిరిగి రావాలని శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. మాతృదేశం వారి కోసం ఎదురు చూస్తోందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నారైలు స్వదేశానికి తిరిగి రావాలని జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. భారత్‌కు ఎన్నారైల అవసరం ఉందని అన్నారు. మాతృదేశం వారి కోసం ఎదురు చూస్తోందని వ్యాఖ్యానించారు (Sridhar Vembu on NRIs Returning to India).
తాముంటున్న దేశాల ఆర్థిక వ్యవస్థకు ఎన్నారైల కారణంగా ఎంతో మేలు జరుగుతోందని శ్రీధర్ వెంబు అన్నారు. అధ్యయనాల్లో కూడా ఇది రుజువైందని తెలిపారు. గత 30 ఏళ్లల్లో ఒక్కో ఎన్నారై, వారి కుటుంబాల కారణంగా అమెరికా ప్రభుత్వానికి 1.7 మిలియన్ డాలర్ల మేర ఖర్చులు తగ్గినట్టు మాన్‌హట్టన్ ఇన్‌స్టిట్యూట్ రీసెర్చ్ అధ్యయనంలో తేలిందని అన్నారు. ఇతర దేశాల వారితో పోలిస్తే భారతీయులే ఈ అంశంలో టాప్‌లో ఉన్నారని తెలిపారు. గత 30 ఏళ్లల్లో ఒక్కో వీసాదారుడి కారణంగా ప్రభుత్వంపై అప్పుల భాగం 2.3 మిలియన్ డాలర్ల మేర తగ్గిందని, జీడీపీ 5 లక్షల డాలర్ల మేర పెరిగిందని ఈ అధ్యయనం తేల్చింది.
అమెరికా టెక్ రంగంలో భారతీయుల ఆధిపత్యానికి వీసా నిబంధనలే కారణమని శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. భారతీయులను ప్రత్యేకంగా ప్రోత్సహించే కుట్ర కోణం ఏదీ లేదని స్పష్టం చేశారు. హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డు నిబంధనల కారణంగా ఉద్యోగాలు మారడం చాలా రిస్కీ అయ్యిందని చెప్పారు. దీర్ఘకాలం పాటు కొనసాగే ఉద్యోగుల కోసం ఎదురు చూసిన సంస్థలు హెచ్-1బీ వీసాదారులతో ఈ అవసరాన్ని తీర్చుకున్నాయని అన్నారు. ఒక సంస్థకు ఉద్యోగులు దీర్ఘకాలం పాటు కట్టుబడి ఉండేలా వీసా వ్యవస్థ ఏర్పాటైందని చెప్పారు. చివరకు భారతీయులు అమెరికా టెక్ కంపెనీల్లో టాప్ పొజిషన్లకు చేరుకున్నారని అన్నారు. భారతీయులనే ప్రత్యేకంగా ప్రోత్సహించే కుట్ర ఏమీ లేదని స్పష్టం చేశారు.
భారత్ నుంచి ఎక్కువ అవుతున్న మేధో వలసల గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదని అన్నారు. దేశం అభివృద్ధి చెందే క్రమంలో ఇది సహజపరిణామమని చెప్పారు. అయితే, మేధావులు భారత్‌ను వీడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి:
తండ్రి ప్రేమ అంటే ఇదీ.. కూతురి కోసం దీపావళి నాడు..
దీపావళి నాడు దారుణం.. నడుముకు 1000 వాలాను చుట్టుకుని వెలిగించడంతో..