Bluefin Tuna: చేపా చేపా.. ఎందుకంత రేటు..
ABN , Publish Date - May 11 , 2025 | 11:25 AM
చైనాకు చెందిన ‘బిగ్ స్టమక్ ఈటర్’ పాతికేళ్ల డెంగ్ చెనెన్ ఏంచేసినా సంచలనమే!. జపాన్‌లో ఆయన ఇటీవల ఖరీదైన సీఫుడ్ బఫెట్ తింటున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఇంతకూ డెంగ్ తింటున్నదేంటి? అదెందుకంత ఖరీదు? వంటి ప్రశ్నల్ని అడిగారు నెటిజన్లు. ఆయన తింటున్నది బ్లూఫిన్ ట్యూనా చేప.
నిజంగానే అది అత్యంత ఖరీదైనది. ఇదెందు కింత రేటో తెలుసుకునే ముందు ఈయన రికార్డుల్ని నెమరేసుకుందాం. ఎవరు ఎక్కువ తింటే వారిదే విజయం వంటి పోటీల్లో పాల్గొనడం డెంగ్‌కు అలవాటు. ఆ మధ్య ఇలాగే ఒక హాంఫట్ కార్యక్రమంలో పాల్గొని.. పాతిక కిలోల పెద్ద పీతల్ని, ముప్పయి ఐదు బర్గర్లను, మరో ముప్పయి చికెన్‌డ్రమ్‌స్టిక్స్‌ను తినేశాడాయన. అప్పట్లో అదొక రికార్డు. అలా కిలోలకు కిలోలు కడుపులోకి తోసేస్తున్నాడు కాబట్టే.. ఆయన్ని ‘బిగ్ స్టమక్ ఈటర్’ అంటున్నారు చైనీయులు, జపనీయులు. డెంగ్ ప్రియురాలు కూడా తక్కువేం తినలేదు.
జపాన్‌లో జరిగిన ఒక ఈటింగ్ పోటీలో 45 నిమిషాల్లో 21 కప్పుల నూడుల్స్ గుటుక్కున మింగేసి అందర్నీ అశ్చర్యపరిచింది. సరే, ఇదలా ఉంచితే డెంగ్ తిన్న ఖరీదైన బ్లూఫిన్ ట్యూనా గురించి తెలుసుకుందాం. ఇది చాలా అరుదైన ట్యూనా చేప. నలుపు రంగులో నిగనిగలాడుతుంటుంది. అందుకే దీనిని బ్లాక్‌డైమండ్ అంటారు మత్స్యకారులు. ఆంధ్రప్రాంతంలో పుస్తెలు అమ్ముకునైనా పులసలు తినాలన్న సామెత ఉన్నట్లే.. జపాన్‌లో కూడా అప్పులు చేసైనా బ్లూఫిన్ ట్యూనా చేపల్ని కొనాలంటారు అక్కడి ప్రజలు. కిలోమీటర్లదూరం ప్రయాణించి మరీ తింటారు జపనీయులు.

ఇదెంత రేటంటే.. 2019లో 277 కిలోల బ్లూఫిన్ చేపను వేలం వేస్తే.. రూ.26 కోట్లు పలికింది. ఇప్పుడైతే ఆ ధరకు రానేరాదు. కోట్లు పోసి కొన్న ఈ ట్యూనా చేపను జపనీయులు ఇష్టంగా తినే సుషీలో వాడతారు. ఈ చేపలో ప్రొటీన్, ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, ఖనిజాలతో పాటు అరుదైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. గుండె, మెదడు, కణజాలం, చర్మ ఆరోగ్యానికి బ్లూఫిన్ చేపను మించిన తిండిలేదంటే లేదన్నది వారి అభిప్రాయం. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారంగా దీనికి పేరుంది. డెంగ్‌చెనెన్ తిండికి ఎందుకంత ప్రత్యేకమో... ఇప్పుడు తెలిసిందిగా!.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంకా బుద్ధిరాలేదు.. మళ్లీ అవే తప్పుడు కూతలు..
షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్
Read Latest Telangana News and National News