UK Man Fined-Spitting: వామ్మో.. ఉమ్మేశాడని రూ.30 వేల ఫైన్
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:31 PM
పొరపాటు ఉమ్మేసినందుకు రూ.30 వేల జరిమానా విధించారంటూ బ్రిటన్‌కు చెందిన ఓ వృద్ధుడు ఫిర్యాదు చేశాడు. అతడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: వీధుల్లో చెత్తాచెదారం వేయడం, ఉమ్మేయడం ఏ దేశం అయినా తప్పే. కానీ ఒక్కోసారి నిబంధనలు అతిక్రమించాల్సిన పరిస్థితి వస్తుంది. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తికి సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపై ఉమ్మేసినందుకు మున్సిపాలిటీ అధికారులు ఏకంగా రూ.30 వేల జరిమానా విధించడంతో ఆ వ్యక్తి లబోదిబోమంటున్నాడు. ఇది నిజంగా ఘోరం అంటూ మీడియా ముందు తన ఆవేదన వెలిబుచ్చాడు (UK Man Fined For spitting Accidentally).
ఇంగ్లండ్‌లోని లింకన్‌షైర్‌లో నివసించే రాయ్ మార్ష్ 86 ఏళ్ల వృద్ధుడు ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ అధికారులపై మండిపడుతున్నారు. నిబంధనల అమలులో కాస్త విచక్షణ పాటించాలని, మరీ ఇంత అతి పనికి రాదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం, ఇటీవల ఒక రోజు ఆయన ఓ బెంచ్‌పై కూర్చుని ఉండగా అకస్మాత్తుగా పెద్ద గాలి వీచింది. ఈ క్రమంలో గాల్లో కొట్టుకొచ్చిన ఓ ఆకు ఆయన నోట్ల పడింది. దీంతో, అసంకల్పితంగా ఆయన ఉమ్మేశాడు. అయితే, అక్కడే ఉన్న ఇద్దరు మున్సిపల్ అధికారులు ఆయనను సమీపించి హెచ్చరించారు. చివరకు 250 పౌండ్స్ ( సుమారు రూ.30 వేలు) జరిమానా విధించారు. దీంతో షాకయిపోవడం రాయ్ వంతైంది.
వాళ్లు మరీ అతి చేస్తున్నారు. నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉంది కానీ ఈ విషయంలో కాస్త విచక్షణగా ఆలోచించాలి. అది అనుకోకుండా జరిగిన పొరపాటు అయితే క్షమాపణలతో వదిలిపెట్టాలి’ అని స్థానికుడు ఒకరు అన్నారు. గతంలో ఇతరులకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. మరోవైపు, బాధితుడి కుమార్తె కూడా మున్సిపాలిటీ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తమాతో బాధపడుతున్న తన తండ్రి వాకింగ్‌కు వెళితే వేధింపులు ఎదురయ్యాయయని తెలిపింది. కాగా, ఘటనపై స్పందించిన ఈస్ట్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ వివరణ ఇచ్చింది. తాము ఎవరినీ ప్రత్యేకంగా టార్గెట్ చేయలేదని చెప్పింది.
ఇవీ చదవండి:
35 ఏళ్ల వయసులో జాబ్ పోయింది.. ఇద్దరు పిల్లలు.. ఇప్పుడెలా? టెకీ ఆవేదన
బ్రిటీషర్ల నుంచి నేను నేర్చుకున్నవి ఇవే.. ఎన్నారై పోస్టు వైరల్