Viral: రెండు చేతులూ పోగొట్టుకున్న మహిళ! సొరచేపతో ఫొటోలు దిగే ప్రయత్నంలో...
ABN , Publish Date - Feb 15 , 2025 | 06:05 PM
సముద్ర తీరం వద్ద సొరచేపతో సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ మహిళ తన రెండు చేతులూ పోగొట్టుకుంది. కరీబియన్ ద్వీప సముదాయంలో ఇటీవల ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇంటర్నెట్ డెస్క్: సొరతో ఫొటో దిగాలని ప్రయత్నించిన ఓ కెనడా మహిళ తన రెండు చేతులూ పోగొట్టుకున్న షాకింగ్ ఘటన తాజాగా కరీబియన్ ద్వీప సముదాయంలో చోటు చేసుకుంది. టర్క్స్ అండ్ కాయ్‌కోసం ద్వీపంలోని థామ్సన్ కోవ్ బీచ్‌లో ఈ ఘటన జరిగింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, సదరు మహిళ ఫొటో కోసం నీళ్లల్లోకి వెళ్లింది. ఎక్కువ దూరం కూడా వెళ్లలేదు. ఇంతలో సొరతో ఫొటో కోసం ప్రయత్నించింది. ఈ లోపు ఆ సొర ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. సొర కొరకడంతో ఒక చేయి మణికట్టు వరకూ మరో చేయి మోచేతి వరకూ ఆమె కోల్పోయింది. రక్తమోడుతున్న ఆమెను స్థానికులు వెంటన ఛెషైర్ హాల్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడి నుంచి కెనడాకు తిరిగొచ్చిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందట (Viral).
Viral: రూ.4 లక్షల టిక్కెట్‌తో విలాసవంతమైన ఫ్లైట్ జర్నీ! వీడియో చూసి షాకవుతున్న జనాలు
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆ సొర చేప దాడికి 40 నిమిషాల ముందు నుంచే ఆ ప్రాంతంలో చక్కెర్లు కొడుతోందట. ఈలోపు మహిళ కంట పడటంతో దాడికి తెగ బడింది. ఆ సొర సుమారు 6 అడుగులు ఉంటుంది. అయితే, అది ఏ జాతికి చెందినదీ మాత్రం ఇంకా తెలియరాలేదు. సొరను చూడగానే నీళ్లలోకి దిగిన ఆమె ఫొటో కోసం ప్రయత్నించినట్టు కొందరు చెప్పుకొచ్చాడు. ఇక దాడి చేసిన సొర మగది అని కూడా చెబుతున్నారు
కాగా, ఈ ఘటన నెట్టింట వైరల్ కావడంతో అనేక మంది విచారం వ్యక్తం చేశారు. మహిళ ప్రాణాలు నిలిచినా రెండు చేతులూ కోల్పోవడం బాధాకరమని కామెంట్ చేశారు. మరికొందరేమో బాధితురాలు నీళ్లల్లోకి దిగడాన్ని తప్పుపట్టారు. ‘‘తీరం నుంచి నీళ్లల్లోపలికి వెళ్లేందుకు అనేక మంది ఉబలాటపడుతుంటారు. సొరలతో ప్రమాదం అని చెప్పినా వినరు’’ అని నిర్వేదం వ్యక్తం చేశారు.
Viral: ఊహించని ట్విస్ట్.. కనిపించకుండా పోయిన భార్య ఆసుపత్రిలో అలా కనిపించే సరికి..
కాగా, ఏటా సుమారు 83 మంది అకారణంగా సొర చేపల బారిన పడుతుంటారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక దక్షిణ ఆస్ట్రేలియా, అమెరికా తూర్పు తీరాల్లో ఇటీవల కాలంలో సొరచేపల దాడులు పెరిగాయని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, అత్యంత ప్రమాదకర సముద్ర జీవి అని సొర వద్దకు వెళ్లే సాహసం చేయొద్దని, ముఖ్యంగా సముద్రాల్లోకి వెళ్లేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు సూచించార. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది.