Top 5 songs: ఈ ఏడాది టాప్ 5 పాటలివే...
ABN , Publish Date - Dec 28 , 2025 | 01:45 PM
ఓ వైపు ఫోక్ సాంగ్స్ ఉర్రూతలూగిస్తే.. మరోవైపు ప్రేమగీతాలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. చక్కని సంగీతానికి తోడు అదిరే డాన్స్ స్టెప్పులూ తోడై యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ రాబట్టుకున్నాయి. ఈ ఏడాది భారతీయుల ప్లే లిస్ట్‌లో ఎక్కువగా మార్మోగిన టాప్ 5 పాటల్ని చూసేద్దాం...
1 ఈ ఏడాది బాలీవుడ్ చిత్రం ‘సైయారా’ పాటలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చిత్ర టైటిల్ ట్రాక్ ఎక్కువమంది చూసిన హిట్‌సాంగ్‌గా టాప్‌లో నిలిచింది. ఈ పాటను 70 కోట్లకు పైగా చూసి, విని ఆనందించారంటే... ఈ పాటకు వచ్చిన క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. తనిష్క్ బాగ్చీ, ఫహీమ్ అబ్దుల్లా, అర్స్లాన్ నిజామీ అందించిన స్వరాలు, ఇర్షాద్ కామిల్ రాసిన అర్థవంతమైన లిరిక్స్ ఈ పాటకు ప్రాణం పోశాయి. ఫహీమ్ అబ్దుల్లా తన గాత్రంతో మ్యాజిక్ చేయగా.. అహాన్ పాండే. అనిత్ పాడ్డా తమ నటనతో పాటకు జీవం పోశారు. కేవలం యూట్యూబ్‌లోనే కాదు, స్పాటిఫై గ్లోబల్ టాప్-50లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి బాలీవుడ్ పాటగా ఇది చరిత్ర సృష్టించింది.

2 ఈ ప్లే లిస్టులో రెండో స్థానంలో తెలుగు పాట నిలవడం విశేషం. పక్కా లోకల్ వైబ్‌తో వచ్చిన ‘రాను బొంబాయికి రాను..’ అనే జానపద గీతం సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. మిలియన్ల వ్యూస్ (68 కోట్లు)తో దుమ్మురేపింది. రాము రాథోడ్ ఈ పాటని రచించడమే కాకుండా గాయని ప్రభతో కలిసి ఆలపించాడు. కళ్యాణ్ కీస్ సంగీతం అందించాడు. రాము రాథోడ్, లిఖిత వేసిన హుక్ స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. అంతర్జాతీయ సెలబ్రిటీలతో కూడా వన్స్‌మోర్ అనిపించింది. ఈ పాటకు తమదైన శైలిలో రీల్స్ చేసిన వారి సంఖ్య కూడా ఎక్కువే.

3 మరాఠీ హిట్ ‘షాకీ’ (ఇండిపెండెంట్ సాంగ్) పాటను సుమారు 59 కోట్లమంది మళ్లీ మళ్లీ విన్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమంది ఈ పాటను షార్ట్స్, రీల్స్ రూపంలోనూ చేసి తెగ ముచ్చటపడ్డారు. సంజూ రాథోడ్ పాడిన ఈ పాటలో అతడితో పాటు నటి ఇషా మాల్వీయ ఆడిపాడింది. సంప్రదాయ మ్యూజిక్‌కి ఆధునిక ఆఫ్రో బీట్స్ జతచేసి జి-స్పార్క్ ఈ పాటను కంపోజ్ చేసింది. ముఖ్యంగా ఇందులోని హుక్ స్టెప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

4 ఈ ఏడాది కుర్రకారు మొబైల్ ఫోన్లలో మార్మోగిన పాటల్లో ‘రాంఝాన్’ ఒకటి. కృతిసనన్, షహీర్ షేక్ జంటగా నటించిన ‘దో పత్తీ’లో అన్ని పాటలు ఒకెత్తైతే ఇది మరో ఎత్తు. ఈ పాటను కౌసర్ మునీర్ రచించగా సచేత్- పరంపర సంగీతం అందించారు. పరంపర ఠాకూర్ గాత్రం అందించింది. హీరోహీరోయిన్ల ప్రేమకథను తలపించేలా సాగే ఈ భావోద్వేగ ప్రణయగీతం శ్రోతల మనసులకు దగ్గరై, 2025లో వారాల తరబడి ట్రెండింగ్‌లో నిలిచింది.

5 భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న హర్యాన్వీ డ్యాన్స్ నంబర్ ‘తేరీ రాంజోల్ బోలేగీ’. షీనమ్ క్యాథలిక్, మాసూమ్ శర్మ, కే డీ, మిస్టర్ బూటా, ఆరోహి రాఘవ్ ఆలపించిన ఈ ఫోక్ సాంగ్ కోట్లాది మందికి నచ్చింది. హుషారైన ఈ పాట పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకల్లో బాగా మార్మోగిపోయింది. అందరితో తీన్‌మార్ స్టెప్పులేయించింది. ప్రాంతీయ భాషలోని పరిమళాన్ని వెదజల్లుతూ సూపర్‌హిట్‌గా నిలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బ్రేకులే లేనట్టు దూసుకుపోతున్న పసిడి, వెండి!
ఆ మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వొద్దు
Read Latest Telangana News and National News