Share News

Fish: ప్రపంచంలో మరెక్కడా దొరకని అరుదైన చేపలు సైతం దొరికే మార్కెట్‌ అది..

ABN , Publish Date - Oct 12 , 2025 | 08:31 AM

టోక్యో నగరం. జనవరి 1. అందరూ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో ఆనందంగా గడుపుతున్నారు. స్థానిక హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌లో మాత్రం టెన్షన్‌ వాతావరణం నెలకొని ఉంది. ఎంత ధరైనా సరే ట్యూనా చేపను వేలంలో దక్కించుకోవాలని డీలర్లు పథకాలు రచిస్తున్నారు.

Fish: ప్రపంచంలో మరెక్కడా దొరకని అరుదైన చేపలు సైతం దొరికే మార్కెట్‌ అది..

- చేపల మార్కెట్ చూడతరమా...

ప్రపంచంలో మరెక్కడా దొరకని అరుదైన చేపలు సైతం దొరికే మార్కెట్‌ అది. పదో, పరకో కాదు... ప్రతిరోజూ సుమారు 480 రకాల సీ ఫుడ్‌ అక్కడి నుంచి సరఫరా అవుతుంది. ట్యూనా వంటి చేపలు వేలంలో అత్యధిక ధర పలుకుతాయి. ఒకవైపు బేరాలు, మరోవైపు క్లీనింగ్‌... జపాన్‌లోని సుకిజీ ఫిష్‌ మార్కెట్‌కు వెళితే, సముద్రంలో ఈత కొట్టినట్టే...

టోక్యో నగరం. జనవరి 1. అందరూ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో ఆనందంగా గడుపుతున్నారు. స్థానిక హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌లో మాత్రం టెన్షన్‌ వాతావరణం నెలకొని ఉంది. ఎంత ధరైనా సరే ట్యూనా చేపను వేలంలో దక్కించుకోవాలని డీలర్లు పథకాలు రచిస్తున్నారు. టోక్యోలోని సుకిజీ మార్కెట్‌లో కనిపించే దృశ్యం ఇది. ఈ మార్కెట్‌లో జరిగే ట్యూనా వేలం ప్రక్రియకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.


2013లో 221 కిలోల బ్లూఫిన్‌ ట్యూనా చేప రూ.15 కోట్లకు అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వేలం ప్రక్రియను లైసెన్స్‌డ్‌ హోల్‌సేల్‌ డీలర్స్‌ నిర్వహిస్తారు. ఎక్కువగా ట్యూనా చేపలు రూ. 1.5 లక్షల నుంచి రూ. 17 లక్షల వరకు వేలంలో అమ్ముడుపోతాయి. అయితే న్యూఇయర్‌ రోజు జరిగే వేడుక అతి పెద్దది. ఈ రోజున జరిగే వేలం పాటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ వేలంలోనే ట్యూనా చేప కోట్లు పలుకుతుంది. మార్కెట్‌ లోపల జరిగే ఈ వేలం పాటను చూడాలంటే ఉదయం 3 గంటలకే వెళ్లి క్యూలో నిల్చోవాల్సి ఉంటుంది. ఈ వేలం ప్రక్రియను చూడటానికి కేవలం 120 మంది పర్యాటకులను మాత్రమే అనుమతిస్తారు. ఇన్నర్‌ మార్కెట్‌లో 900 మంది లైసెన్స్‌డ్‌ హోల్‌సేల్‌ డీలర్స్‌ ఉన్నారు. ప్రతి ఒక్కరికీ ఒక స్టాల్‌ ఉంటుంది. వేలంలో కొనుగోలు చేసిన ట్యూనాను ముక్కలుగా కట్‌ చేసి, నగరంలో ఉన్న ప్రముఖ సుషీ రెస్టారెంట్లకు సరఫరా చేస్తారు.


403 కిలోల ట్యూనా...

రూ.2 కోట్ల 86 లక్షలు...

‘సుషీ’ అనేది సంప్రదాయ జపనీస్‌ వంటకం. రెస్టారెంట్‌, ఫుడ్‌ సర్వీస్‌ కంపెనీ అధిపతి అయిన హిరోషి ఒనొడెరా గత ఏడాది న్యూఇయర్‌ వేలంలో పాల్గొని 403 కిలోల ట్యూనా చేపను రూ.2 కోట్ల 86 లక్షలకు కైవసం చేసుకున్నారు. ఈ మార్కెట్‌లో జరిగే ట్యూనా చేప వేలం గురించి తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ వర్గాలు ఆసక్తి చూపిస్తాయి. ఇకపోతే ఔటర్‌ మార్కెట్‌ అందరికీ తెరిచి ఉంటుంది. ఇక్కడ సీఫుడ్‌ రిటైల్‌ షాపులతో పాటు రెస్టారెంట్లు, కిచెన్‌ టూల్స్‌, కిరాణ షాపులు ఉంటాయి. సంప్రదాయ, రుచికరమైన జపనీస్‌ ఆహారం కూడా దొరుకుతుంది. పర్యాటకులు ఈ ఆహారాన్ని రుచి చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు.


book4.2.jpg

ప్రపంచంలోనే అతి పెద్దది...

ప్రపంచంలోనే అతి పెద్ద చేపల మార్కెట్‌గా గుర్తింపు ఉన్న సుకిజీ మార్కెట్‌ను ‘వాల్‌స్ట్రీట్‌ ఆఫ్‌ ఫిష్‌’ అని పిలుస్తారు. సుకిజీ మార్కెట్‌ నుంచి ప్రతిరోజూ 2 వేల మెట్రిక్‌టన్నుల సీఫుడ్‌ సరఫరా అవుతుంది. ప్రతిరోజూ రూ.180 కోట్ల తాజా సీఫుడ్‌ అమ్మకాలు, కొనుగోళ్లు అక్కడ జరుగుతుంటాయి. ఏటా ఈ మార్కెట్‌ నుంచి 5 లక్షల కోట్ల విలువైన సీ ఫుడ్‌ సరఫరా అవుతున్నట్టు మార్కెట్‌వర్గాలు చెబుతాయి. ప్రపంచంలో మరెక్కడా ఇంత పెద్ద సీఫుడ్‌ మార్కెట్‌ కనిపించదు.


ఈ మార్కెట్‌కు శతాబ్దాల చరిత్ర ఉంది. 16వ శతాబ్దంలో చేపల మార్కెట్‌ ప్రారంభమైంది. మొదట్లో ఈ మార్కెట్‌ పేరు ‘ఉగోషి’. 1923లో సంభవించిన భూకంపంతో మార్కెట్‌ మొత్తం దెబ్బతినడం, నగరం విస్తరించడంతో 1935లో సుకిజీ ప్రాంతానికి తరలించారు. ఆ తరువాత క్రమక్రమంగా మార్కెట్‌ ప్రముఖ పర్యాటక కేంద్రంగానూ గుర్తింపు పొందింది. సుకిజీ చేపల మార్కెట్లో చేపల నిలువ కోసం అద్భుతమైన శీతలీకరణ గదులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు శానిటేషన్‌ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. డీలర్లు, రిటైలర్లు, కొనుగోలుదారులు, పర్యాటకులతో నిత్యం బిజీగా ఉంటుంది. జపనీస్‌ ఫిష్‌ కల్చర్‌పై అధ్యయనం చేసిన హార్వర్డ్‌ ఆంథ్రో పాలజీ ప్రొఫెసర్‌ టెడ్‌ బెస్టర్‌ ఈ మార్కెట్‌ను ‘‘ప్రపంచ మత్స్య పరిశ్రమకు కేంద్రబిందువు’’ అన్నారు. గడచిన దశాబ్ద కాలంలో అనూహ్యంగా ఈ మార్కెట్‌ జపాన్‌ టాప్‌ టూరిస్ట్‌ అట్రాక్షన్‌గా మారడం విశేషం.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరలకు రెక్కలు.. నేటి ధరలు చూస్తే..

విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 12 , 2025 | 08:31 AM