Viral: హోటల్ గది అద్దె గంటకు రూ.5 వేలు.. తట్టుకోలేక కుంభమేళా నుంచి తిరుగుప్రయాణం!
ABN , Publish Date - Feb 12 , 2025 | 06:51 PM
కుంభమేళాలో హోటల్ గది అద్దె గంటకు రూ.5 వేలకు చేరుకోవడంతో ఓ వ్యక్తి పుణ్యస్నానం చేయకుండానే వెనుదిరిగాడు. అతడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్‌రాజ్ జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనాలు పోటెత్తారు. ఇక కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాం ఏర్పడటం జనాల సహనానికి మరింత పెద్ద పరీక్ష పెట్టింది. ధరలు ఆకాశాన్నంటడంతో జనాలకు చుక్కలు కనిపించాయి. అలాంటి ఓ వ్యక్తి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అక్కడి పరిస్థితులకు తట్టుకోలేక అతడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది (Viral).
తనకు ప్రయాగ్‌రాజ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైందీ ఏకరవు పెడుతూ దినేశ్ రానా అనే వ్యక్తి నెట్టింట పోస్టు చేశాడు. కుంభమేళాలో పాల్గొనేందుకు దినేశ్ తన స్నేహితులతో కలిసి గత శుక్రవారం బయలుదేరాడు. వాస్తవానికి వారి ప్రయాణం 12 గంటల్లోనే పూర్తి కావాలి. కానీ మరో రెండు రోజుల తరువాత గానీ వారు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకోలేకపోయారు. అక్కడ కూడా వారికి ఇక్కట్లు ఎదురయ్యాయి. త్రివేణి సంగమానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వారికి ప్రయాణసాధానాలేవీ అందుబాటులో లేవు. ఒక ఈ రిక్షా వ్యక్తి సంగమం వరకూ వారిని తీసుకెళ్లేందుకు ఏకంగా రూ.1000 అడిగాడు.
Racial Abuse: లండన్ రైల్లో భారత సంతతి యువతికి దారుణ వేధింపులు! షాకింగ్ వీడియో
కొందరు బైకర్లు తమను తీసుకెళ్లేందుకు రూ.600 కూడా అడిగారని దినేశ్ చెప్పుకొచ్చారు. అంత ఇచ్చుకోవడం ఇష్టం లేని వారు చివరకు కాలినడకన త్రివేణీ సంగమ ప్రదేశానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే వారు అలసిపోయి ఉండటంతో కాస్త రెస్టు తీసుకుందామని భావించి హోటల్ గదుల కోసం వెతికితే మరో షాక్ తగిలింది. హోటల్ గదికి గంటకు రూ.5 వేలు తీసుకుంటామని ఓ వ్యక్తి చెప్పడంతో అతడు షాకైపోయాడు. మరింత చవకగా ఏదైనా హోటల్ గది దొరుకుతుందేమో అని వారు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. దీంతో, వారు పుణ్యస్నానం చేయకుండానే వెనుదిరిగారు.
Weight Loss: భారీ కాయంతో విమానంలో ఎక్కలేక.. 82 కేజీల బరువు తగ్గిన యువకుడు
ఇక నగరం సరిహద్దు వద్ద తమ బస్‌ను నిలిపి ఉంచామని, అక్కడ కూడా జనాలు లోపలికి దూసుకొచ్చే ప్రయత్నం చేశారని దినేశ్ తెలిపాడు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వాపోయారు. ఒక్క కప్పు టీ రూ.50కి చేరిందని తెలిపారు.