Racial Abuse: లండన్ రైల్లో భారత సంతతి యువతికి దారుణ వేధింపులు! షాకింగ్ వీడియో
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:14 PM
లండన్ రైల్లో ఓ భారత సంతతి యువతి జాత్యాహంకార వేధింపులను ఎదుర్కొంది. మద్యం మత్తులో ఓ ప్యాసెంజర్ ఆమెపై నోరు పారేసుకున్నాడు. దారుణంగా అవమానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: వలసలపై పలు పాశ్చాత్య దేశాల్లో వ్యతిరేకత పెల్లుబుకుతున్న వేళ బ్రిటన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. లండన్ నుంచి మాంచెస్టర్‌కు వెళుతున్న రైల్లో భారతీయ సంతతి యువతిపై ఓ వ్యక్తి జాత్యాహంకార వేధింపులకు పాల్పడ్డాడు. అతడు తనపై దాడి కూడా చేసే అవకాశం ఉందని భయపడ్డ మహిళ నిందితుడికి అడ్డుకట్ట వేసేందుకు వీడియో కూడా రికార్డు చేసింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి (Viral).
గాబ్రియల్ ఫోర్సిత్ అనే యువతికి ఆదివారం నాడు రైల్లో ప్రయాణిస్తుండగా ఈ దారుణ అనుభవం ఎదురైంది. పక్క ప్యాసెంజర్‌తో ఏదో మాట్లాడుతూ తన వృత్తి గురించి చెప్పానని బాధితురాలు తెలిపింది. తన వలసదారులకు సాయపడుతూ ఉంటానని చెప్పగానే పక్కనే ఉన్న మరో వ్యక్తి రెచ్చిపోయి తనపై అవాకులుచెవాకులు పేలడం ప్రారంభించాడని ఆవేదన వ్యక్తం చేసింది. మిగతా ప్రయాణికులను కూడా వలదారులని పిలుస్తూ అవమానించాడని పేర్కొంది.
Weight Loss: భారీ కాయంతో విమానంలో ఎక్కలేక.. 82 కేజీల బరువు తగ్గిన యువకుడు
ఆ శ్వేతజాతీయుడు భారత సంతతి యువతిపై ఇష్టారీతిన మాట్లాడుతున్న వీడియో సంచలనంగా మారింది. ‘‘నువ్వు ఇంగ్లాండ్‌లో ఉన్నావు. ఇంగ్లిష్ జనాలు ప్రపంచాన్ని ఆక్రమించారు. మేము ఇండియాను ఆక్రమించాము. మాకు దాన్ని తిరిగివ్వడం ఇష్టంలేకపోయినా మీకు తిరిగిచ్చేశాము. ఎన్నో దేశాల పరిస్థితి ఇదే. మా స్వాతంత్ర్యం అని ఏదో చెబుతున్నావు కానీ అది పెద్ద వషయమే కాదు’’ అని అతడు వీడియోలో అనడం స్పష్టంగా రికార్డైంది.
Viral: వామ్మో.. ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయా? ఉద్యోగులు కోరిన శాలరీ ఇవ్వలేక...
అయితే, ఈ వీడియో చూసిన అనేక మంది తనపైనే విమర్శలు గుప్పించారని గేబ్రియేల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇది దారుణమైన పరిస్థితి అని వ్యాఖ్యానించింది. ‘‘ఓ భారత సంతతి వ్యక్తిగా, వలసొచ్చిన వ్యక్తికి కూతురిగా నా చరిత్ర, నా సంస్కృతి గురించి నాకు తెలుసు. ఇది నాకు దేవుడి దీవెన, బహుమతితో సమానం. నాతో పాటు ఇతర శ్వేత జాతీయేతరుల ఆత్మగౌరవం కోసం ప్రతిఘటించడం నాకెంతో గర్వకారణం’’ అని ఆమె వ్యాఖ్యానించింది. ఇటీవలే అక్కడి వెస్ట్ కోస్ట రైల్లో దాదాపు ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. అక్కడి భారతీయ సంతతి డెంటిస్టుపై ఓ మహిళ నోరుపారేసుకుంది. మీ దేశానికి వెళ్లిపో అంటూ అవమానించింది.