Viral Breakup at Gujarat: ఉల్లి తెచ్చిన లొల్లి.. 23 ఏళ్ల వివాహ బంధానికి తెర.!
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:16 PM
ఉల్లిపాయ.. దంపతుల మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో ఇది.. ఒకరికి ఇష్టంగా, మరొకరికి అయిష్టంగా మారి.. ఏకంగా ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారి వైవాహిక జీవితానికి చెక్ పెట్టింది. అసలేమైందంటే...
ఇంటర్నెట్ డెస్క్: తల్లిచేయని మేలు ఉల్లి చేస్తుందంటారు.. కానీ ఈ ఉల్లిపాయే రెండు దశాబ్దాలకుపైగా కొనసాగుతున్న ఓ వివాహ బంధానికి తెరదించింది(Onion Dispute). ఉల్లిపాయ కోసం 23 ఏళ్ల వైవాహిక జీవితానికి బ్రేకప్(Breakup) చెప్పుకుంది ఓ జంట. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న ఈ విషయమై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఉల్లి చేసిన ఆ లొల్లి ఏంటి? ఈ బ్రేకప్ ఏంటంటారా? అయితే ఈ కథనం చదవాల్సిందే...
గుజరాత్(Gujarat)లోని అహ్మదాబాద్(Ahmedabad)కు చెందిన ఓ జంట.. 2002లో పెళ్లి చేసుకున్నారు. భార్య.. స్వామినారాయణ్(Swamy Narayan) అనే ఓ మత బోధకుణ్ని అనుసరిస్తున్నారు. ఆయన సూచనల ప్రకారం.. ఇంట్లో ఉల్లి వాడకాన్ని తగ్గించారామె. భర్తకూ ఇదే సలహానిస్తూ.. ఉల్లిపాయ ఉపయోగించరాదని కండీషన్ పెట్టారు. అయితే.. అప్పటికే ఉల్లి లేకపోతే ముద్ద దిగదన్నట్టుగా.. ఉల్లికి బాగా అలవాటైపోయారు భర్త, ఆయన తల్లి. దీంతో ఇంట్లోకి ఉల్లిపాయల్ని తీసుకురాకుండా ఉండేందుకు గట్టిగానే ప్రయత్నించారామె. ఈ విషయంలో ఆ దంపతుల మధ్య చాలా కాలంగా విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. క్రమంగా ఉల్లి నుంచి వెల్లుల్లి వాడకంపై కూడా రిస్ట్రిక్షన్ పెట్టారు భార్య. కానీ, తల్లీ కొడుకులు మాత్రం వాటిని వాడకుండా ఉండలేకపోయారు. ఇవేమీ పట్టనట్టుగా యథాతథంగా వాటిని వంటల్లో ఉపయోగిస్తూనే ఉన్నారు.
వేరుగా వంటలు.. ఆపై పుట్టింటికి..
ఇక, చేసేదేమీ లేక భార్య.. తనకోసం మాత్రమే విడిగా ఉల్లిలేని వంటకాలను చేసుకోవడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా.. ఇంట్లోని అన్ని వస్తువులను వేరుగా ఉపయోగించడం మొదలెట్టారామె. ఒకే ఇంట్లోనే ఉంటూ.. అంటీముట్టనట్టు ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమెపై ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ విభేదాల కారణంగా ఆమె 2007లో తన బిడ్డతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత.. 2013లో అహ్మదాబాద్ కోర్టులో విడాకుల(Divorce)కు దరఖాస్తు చేసుకున్నారు భర్త. ఆహారపు విషయంలో భార్య.. తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొంటూ.. తమ మధ్య చెలరేగిన వాగ్వాదాన్ని గురించి న్యాయస్థానానికి చెప్పుకున్నారు. దీంతో.. 2024లో ఆయనకు విడాకులు మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే.. భార్యకు మెయింటెనెన్స్(Maintenance) కింద భరణం ఇవ్వాలని ఆదేశించింది.
కోర్టు ఆదేశానుసారం ఆయన.. సక్రమంగా భరణం చెల్లించడం లేదని ఇటీవల గుజరాత్ హైకోర్టు(Gujarat High Court)లో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం రూ.13.02 లక్షలకు గానూ.. రూ.2.72లక్షలు మాత్రమే చెల్లించాడని పేర్కొన్నారు. దీంతో మరో రూ.4.27లక్షలు ఆమెకు బదిలీచేశారాయన. మిగతా మొత్తాన్నీ చెల్లించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయమై అహ్మదాబాద్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఆహారపు అలవాట్లు పొసగనప్పుడు.. బలవంతంగా కలిసి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది.
అయితే.. 23 ఏళ్ల జీవితానికి ఉల్లిపాయ కారణంగా విడాకులు తీసుకున్న ఈ దంపతుల వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది(Viral Breakup). దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఉల్లిపాయల కోసం విడాకులు ఏందన్నట్టు ఒకరు కామెంట్ చేస్తే.. భర్త కోసం భార్య అయినా లేదా భార్య కోసం భర్త అయినా అడ్జస్ట్ అయ్యుంటే బావుండేదని మరొకరు వ్యాఖ్యానించారు. ఇలా ప్రస్తుతం దీనిపై ఓ రకంగా పెద్ద డిబేటే నడుస్తోంది.
ఇవీ చదవండి:
అమ్మాయితో కలిసి కాలేజ్ నుంచి పారిపోదామనుకున్నాడు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..
థ్రిల్లింగ్ ఫైట్.. పాము ముంగిసల పోరాటంలో విజేత ఎవరో చూడండి..