Share News

Mumbai: భార్య వేధింపులకు మరో టెకీ సూసైడ్.. అతను రాసిన లెటర్ చూస్తే కన్నీళ్లు ఆగవు..

ABN , Publish Date - Mar 07 , 2025 | 06:54 PM

ముంబైకి చెందిన నిషాంత్ త్రిపాఠికి అపూర్వ పారిఖ్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. వారి మధ్య మనస్పర్ధలు రావడంతో నిషాంత్ అత్త ప్రార్థన కుంపటిని మరింత రగిలించింది. గొడవలు పెద్దవయ్యేలా ఇద్దరినీ రెచ్చగొట్టింది.

Mumbai: భార్య వేధింపులకు మరో టెకీ సూసైడ్.. అతను రాసిన లెటర్ చూస్తే కన్నీళ్లు ఆగవు..
Mumbai techie Nishant Tripathi

ముంబై: భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల వరస ఆత్మహత్య ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మెున్న అతుల్ సుభాష్, నిన్న మానవ్‌ శర్మ బలవన్మరణానికి పాల్పడగా.. నేడు తాజాగా నిషాంత్ త్రిపాఠి అనే టెకీ ఆత్మహత్య సంచలనం సృష్టిస్తోంది. అయితే ఆత్మహత్యకు ముందు వారు విడుదల చేస్తున్న వీడియో, సూసైడ్ నోట్లు పలువురిని కన్నీటిపర్యంతం చేస్తున్నాయి.


ముంబైకి చెందిన నిషాంత్ త్రిపాఠి(41)కి అపూర్వ పారిఖ్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. వారి మధ్య మనస్పర్ధలు రావడంతో నిషాంత్ అత్త ప్రార్థన కుంపటిని మరింత రగిలించింది. గొడవలు పెద్దవయ్యేలా ఇద్దరినీ రెచ్చగొట్టింది. అపూర్వ, ఆమె తల్లి ప్రార్థన కలిసి నిషాంత్‌ను తీవ్రంగా వేధించారు. మానసికంగా హింసించారు. ఆ బాధలు భరించలేని అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు గత శుక్రవారం ముంబై నగరంలోని సహారా హోటల్‌లో అద్దెకు దిగాడు. తన గది బయట తలుపునకు "డు నాట్ డిస్టర్బ్" అనే బోర్డు పెట్టాడు. దీంతో అతన్ని ఎవ్వరూ కదలించలేదు. అయితే ఆత్మహత్యకు ముందు తాను పని చేస్తున్న కంపెనీ వెబ్‌సైట్‌కు సూసైడ్ నోట్‌ను పంపాడు నిషాంత్. అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.


మూడ్రోజులైనా నిషాంత్ గది నుంచి బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. వారి వద్ద ఉన్న మరో తాళంచెవితో నిషాంత్ గది తలుపు ఓపెన్ చేశారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి భయాందోళనకు గురయ్యారు. నిషాంత్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. దీంతో హోటల్ సిబ్బంది వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఖాకీలు.. మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కాగా, అందులోని అంశాలు పోలీసుల కళ్లను సైతం చమర్చేలా చేశాయి.


నిషాంత్ సూసైడ్ నోట్..

"నువ్వు(అపూర్వ) దీన్ని చదివే సమయానికి, నేను చనిపోయి ఉంటాను. నా చివరి క్షణాల్లో జరిగిన ప్రతి దానికీ నిన్ను ద్వేషించాల్సి ఉంది. కానీ, అలా చేయలేదు. నిన్ను ద్వేషించాల్సిన సమయంలోనూ ప్రేమించాను. అప్పుడూ ప్రేమించా, ఇప్పుడు ప్రేమిస్తున్నా, నేను చనిపోయినా తర్వాతా ప్రేమిస్తా. నీపై నా ప్రేమ మారదని ప్రమాణం చేస్తున్నా. నువ్వు, మీ అమ్మ ప్రార్థన వల్లే చనిపోతున్నా. మీరు నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. మానసికంగా వేధించారు. ఆ విషయం మా అమ్మకి కూడా తెలుసు. నేను చనిపోయిన తర్వాత మీరిద్దరూ నా తల్లి వద్దకు వెళ్లకండి. ఆమె ఇప్పటికే చాలా విసిగిపోయింది. ఆమెను ప్రశాంతంగా వదిలివేయండి" అంటూ రాశాడు.


నిషాంత్ తల్లి పోస్ట్..

నిషాంత్ తల్లి చతుర్వేది సైతం కుమారుడి మరణంపై స్పందిస్తూ ఫేస్ బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. "నా జీవితం ముగిపోయింది. నా కొడుకు నిషాంత్ నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. నేను ఇప్పుడు ఒక సజీవ శవంలా మారిపోయాను. అతను నా అంత్యక్రియలు చేయాలి, కానీ నేనే అతనికి చేయాల్సి వచ్చింది. నా కూతురు ప్రాచి తన అన్నయ్య అంత్యక్రియలు నిర్వహించింది. జీవితంలో ఇంతపెద్ద పిడుగుపాటును భరించగలిగేలా ధైర్యం ఇవ్వండి" అంటూ బాధిత తల్లి పేర్కొంది.


కాగా, మగవారి వరస ఆత్మహత్యలు కొంతమంది మహిళల వేధింపులకు నిదర్శనంగా నిలుస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా భార్య బాధితులు పెరిగిపోతున్నారని చెప్పడానికి ఈ ఘటనలే ఉదాహరణ అని పలువురు చర్చించుకుంటున్నారు. ఆడవారి మాదిరిగానే మగవారికీ ప్రత్యేక చట్టాలు తీసుకురావాలనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Viral Video: స్కూటీపై వెళ్తున్న మహిళ.. వెనుక పిల్లాడిని గమనించిన బైకర్.. సమీపానికి వెళ్లి చూడగా..

Shocking Video: నీ చేతులతో చేసిన టీ కావాలని అడిగిన భర్త.. భార్య చేసిన పనికి వాంతులు రావడం ఖాయం..

Updated Date - Mar 07 , 2025 | 06:59 PM