Share News

చీకటి పడితే మెరుస్తుంది..

ABN , Publish Date - May 11 , 2025 | 01:40 PM

సాధారణంగా ఎక్కడైనా ప్రకృతి అందాలను వీక్షించడానికి ఉదయమో, సాయంత్రమో వెళుతుంటాం. కానీ ఇండోనేషియాలోని ‘ఆర్కిడ్‌ ఫారెస్ట్‌’ అందాలను చూడాలంటే మాత్రం చీకటి పడ్డాకే వెళ్లాలి. ఎందుకంటే ఆ అడవిలో ఉన్న వంతెన రాత్రుళ్లు ధగ ధగా మెరిసిపోతూ కనువిందు చేస్తుంది. ఆ అద్భుత దృశ్యం కోసమే పర్యాటకులు చీకటి పడేదాకా ఆగుతారు...

చీకటి పడితే మెరుస్తుంది..

పగటివేళ సాధారణ వంతెనలానే ఉంటుంది. చీకటి పడితే మాత్రం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. ఇండోనేషియాలోని వెస్ట్‌ జావా ప్రావిన్స్‌లో ఉన్న లెంబాంగ్‌ పట్టణానికి సమీపంలో ఆర్కిడ్‌ చెట్లతో దట్టమైన అడవి ఉంది. ఇది ఇండోనేషియాలోనే అత్యధిక ఆర్కిడ్‌ వృక్షాలు ఉన్న అడవిగా గుర్తింపు పొందింది.

తెలుపు, ఊదా, గులాబీ, పసుపు, మెజెంటా రంగుల పూలతో విశేషంగా ఆకట్టుకునే ఆర్కిడ్‌ చెట్లు ఇక్కడ ఉన్నాయి. కేవలం వీటిని చూసేందుకే పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారనుకుంటే పొరపాటే. ఇదే అడవిలో ఉన్న ఒక ‘మ్యాజికల్‌ బ్రిడ్జ్‌’ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. చీకటి పడగానే పసుపు లైట్ల వెలుతురులో వంతెన మెరిసిపోతూ కనిపిస్తుంది. అడవి అందాలు రెట్టింపు చేసేలా, పర్యాటకులను ఆకర్షించేలా ఈ వంతెనను డిజైన్‌ చేశారు.


విద్యుత్‌ దీపాల వెలుగుల్లో...

లెంబాంగ్‌ పట్టణానికి సమీపంలో 25 ఎకరాల్లో విస్తరించిన అడవిలో సుమారు 20 వేల ఆర్కిడ్‌ చెట్లు, పైన్‌ చెట్లు ఉన్నాయి. ఈ అడవి మధ్యలో 492 అడుగుల పొడవైన వంతెన కూడా ఉంది. 74 అడుగుల ఎత్తులో ఉండే ఈ వంతెనపై నడుస్తూ అడవి అందాలను పర్యాటకులకు వీక్షిస్తారు. ఈ అడవి సముద్రమట్టానికి 5577 అడుగుల ఎత్తులో ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకు ఉల్లాసాన్నిస్తాయి. ఇదంతా పగటిపూట కనిపించే దృశ్యం. చీకటి పడ్డాక సీన్‌ మారుతుంది. అదే అడవిలో భిన్న అనుభూతినిచ్చే అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. పసుపు రంగు లైట్ల కాంతులతో ధగధగా మెరిసిపోతున్న వంతెనపై నడుస్తూ అడవి అందాలు వీక్షించడం ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది. అక్కడ పిల్లల కోసం ప్రత్యేకంగా ఆటస్థలం, క్యాంపింగ్‌ గ్రౌండ్‌, కేఫ్‌, సావనీర్‌ షాప్‌ వంటివి ఉన్నాయి. అవుట్‌డోర్‌ థియేటర్‌లో మ్యూజిక్‌ షోలు జరుగుతూ ఉంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

రూ.70 లక్షల లంచం డిమాండ్‌

ఇంకా బుద్ధిరాలేదు.. మళ్లీ అవే తప్పుడు కూతలు..

ముందుగానే నైరుతి రుతుపవనాలు

షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్‌

Read Latest Telangana News and National News

Updated Date - May 11 , 2025 | 01:40 PM