Railway Station : ఈ రైల్వే స్టేషన్‌లోకి వీసా ఉంటేనే ఎంట్రీ.. ఇండియాలో ఎక్కడుందంటే..
ABN , Publish Date - Jan 21 , 2025 | 08:14 PM
ఇండియాలో ఎయిర్‌పోర్ట్‌లో అయినా విదేశాలకు వెళ్లినపుడే చూపించాల్సి వస్తుంది. కానీ, రైల్వేస్టేషన్‌కు వెళ్తే వీసా లేదా పాస్‌పోర్ట్ అడుగుతారని ఎప్పుడైనా విన్నారా.. అదీ ఇండియాలో.. అదేంటీ, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఏ రాష్ట్రానికి ప్రయాణించడానికి వీసా లేదా పాస్‌పోర్ట్ అవసరం లేదు కదా అనుకోవచ్చు. కానీ, ఈ రైల్వేస్టేషన్ మాత్రం చాలా ప్రత్యేకం. అదెక్కడుందంటే..
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉన్న టాప్-10 దేశాలలో భారత్ కూడా ఒకటి. మన దేశంలో 7,000 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సాధారణంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఏ రాష్ట్రానికి ప్రయాణించడానికి వీసా లేదా పాస్‌పోర్ట్ అవసరం లేదు. ప్రతి భారత పౌరుడు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోని స్టేషన్‌కైనా వెళ్లిపోవచ్చని అందరికీ తెలుసు. ఎయిర్‌పోర్ట్‌లో అయినా బయటి దేశాలకు వెళ్లినపుడే చూపించాల్సి వస్తుంది. కానీ, ఒక్క రైల్వేస్టేషన్ మాత్రం ఇందుకు మినహాయింపు. ఇక్కడ ఎవరు అడుగుపెట్టాలన్నా పాస్‌పోర్ట్ కచ్చితంగా ఉండి తీరాల్సిందే. అదేంటీ, ఇలా ఎవరూ చెప్పగా వినలేదే అనుకోవచ్చు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. అలాంటి రైల్వేస్టేషన్ మన ఇండియాలోనే ఉంది. ఇంతకీ, ఆ రైల్వేస్టేషన్ ఎక్కడుంది? ఈ ఒక్క స్టేషనే ఎందుకంత స్పేషల్ అనుకుంటున్నారా? మరి, ఏ కారణం చేత పాస్‌పోర్ట్ రూల్ తీసుకొచ్చారో ఈ కథనంలో తెలుసుకుందాం..
మనం చెప్పుకుంటున్న రైల్వే స్టేషన్ పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో ఉంది. అట్టారీ రైల్వేస్టేషన్ భారతదేశంలోని చివరి స్టేషన్. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన రైల్వే స్టేషన్లలో ఒకటి. భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. వాఘా సరిహద్దుకు ఆనుకుని అమృత్‌సర్-లాహోర్ లైన్‌లో ఉన్న అట్టారీ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించాలంటే పాకిస్థాన్ వీసా తప్పనిసరి. అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఉండటం వల్లే అట్టారీ స్టేషన్‌లో అడుగుపెట్టేందుకు పాస్‌పోర్ట్ సహా అనేక రూల్స్ తీసుకొచ్చారు. అవేంటంటే..
అట్టారీ రైల్వే స్టేషన్‌లోకి వీసా లేకుండా వెళ్లినా, పొరపాటున ఇక్కడ దిగినా అరెస్టు చేయడంతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. చట్టపరమైన పరిణామాలూ ఎదుర్కొవాల్సి ఉంటుంది.ఈ స్టేషన్‌లో జరిగే కార్యకలాపాలను భద్రతా బలగాలు 24 గంటలు పర్యవేక్షిస్తుంటాయి. ఈ స్టేషన్‌ను సందర్శించే ఎవరైనా చెల్లుబాటు అయ్యే వీసా మరియు పాస్‌పోర్ట్ కలిగి ఉండటం తప్పనిసరి.
భారతదేశం-పాకిస్థాన్‌ల సరిహద్దుల మధ్య అట్టారీ రైల్వే స్టేషన్ ఉంది కాబట్టే అంత ప్రత్యేకం. ఇక్కడ నుంచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ నేరుగా పాకిస్తాన్‌కు బయలుదేరుతుంది. అయితే, 2019లో జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత నుంచి ఈ రైలు సర్వీస్ నిలిపివేశారు. అందుకే, ఎప్పుడూ ప్రయాణీకులతో రద్దీగా ఉండే అట్టారీ స్టేషన్ ప్రస్తుతం నిర్మానుష్యంగా మారింది.