Hiker Falls from Mountain: సెల్ఫీ మోజు.. పర్వత శిఖరంపై ప్రాణం కోల్పోయిన హైకర్
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:11 PM
సెల్ఫీ మోజులో పడి పర్వత శిఖరంపై తన ప్రాణం కోల్పోయాడు ఓ హైకర్. ఈ విషాదకరమైన ఘటన చైనాలో చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. మౌంట్ నామా (Mount Nama) అనే 18,000 అడుగుల ఎత్తైన పర్వతాన్ని ఎక్కుతున్న ఒక హైకర్, సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ కింద పడిపోయి మృతి చెందాడు.
సెప్టెంబర్ 25న పర్వతాన్ని అధిరోహించే హైకింగ్ గ్రూపులో 31 ఏళ్ల హాంగ్ అనే వ్యక్తి చేరాడు. మౌంట్ నామా పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో, శిఖరానికి దగ్గరగా సెల్ఫీ తీసుకోవాలనే ఉద్దేశంతో అతను తన భద్రతా తాడును విప్పేశాడు. తాడు లేకుండా మంచుతో కప్పబడిన వాలుమీద నిలబడిన సమయంలో అతను బ్యాలెన్స్ కోల్పోయి దాదాపు 200 మీటర్లు (656 అడుగులు) కిందకు జారిపోయాడు. ఈ దృశ్యం హైకింగ్ గ్రూప్‌లోని ఇతర సభ్యుల కళ్లముందే జరిగింది. కానీ, వాళ్లెవరూ అతన్ని కాపాడలేకపోయారు.
అధికారుల ప్రకారం, హాంగ్ తన భద్రతా తాడు తీసేసి, ఐస్ యాక్స్ లేకుండానే నిలబడ్డాడు. కాళ్లకు ఉన్న క్రాంపాన్ బూట్లు మంచు మీద జారిపోవడంతో అతను అదుపు తప్పి పడిపోయాడు. ప్రమాదం అనంతరం హాంగ్‌ను రక్షించేందుకు స్థానిక అధికారులు తక్షణమే చర్యలు తీసుకున్నా, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని తీవ్రంగా శ్రమించి స్థానిక మౌంటెన్ టౌన్‌కు తరలించారు.
హాంగ్‌కు ఇది మొట్టమొదటి మంచు పర్వతారోహణ ప్రయాణం అని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అనుభవం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం ఈ ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హాంగ్ తాడు లేకుండా నిలబడిన దృశ్యం, జారి పడే దృశ్యం, తోటి హైకర్లు భయంతో చూసే క్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Also Read:
35 ఏళ్ల తర్వాత జూపార్కు లోకి జీబ్రాలు..
వావ్.. పారాసిటమాల్‌తో బట్టలు ఉతకొచ్చా.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
For More Latest News