God equation theory: దేవుడి ఉనికికి గణిత ఫార్ములాతో ప్రూఫ్.. హార్వర్డ్ శాస్త్రవేత్త స్టేట్మెంట్
ABN , Publish Date - Mar 09 , 2025 | 01:17 PM
దేవుడు ఉన్నాడా అంటే యస్ అని సమాధానమిస్తున్నారో హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త. ఆయన ఉనికికి ఓ గణిత ఫార్ములా ఆధారం కాగలని ప్రతిపాదించారు. సైన్స్‌కు ఆధ్యాత్మికతకు ఈ ఫార్ములా ఓ వారధిగా నిలుస్తుందన్న ఆశాభావం కూడా వ్యక్తం చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: దేవుడు ఉన్నాడా.. ఇప్పటివరకూ ఇది సమాధానం లేని ప్రశ్న. దేవుడిని నమ్మేవారు ఉన్నారంటారు. కాదు.. భగవంతుడు ఉన్నాడనేందుకు ఆధారాలు లేవని మరికొందరు అంటారు. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేది ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంతో చెప్పడం కష్టమని మరికొందరు వాదిస్తారు. అయితే, ఆపైవాడు ఉన్నాడనే విషయాన్ని ఓ గణిత ఫార్ములాతో రుజువు చేయగలమని ఓ శాస్త్రవేత్త ముందుకొచ్చారు. ఖగోళ శాస్త్రవేత్తం, ఏయిరోస్పేస్ ఇంజినీర్ డా. విల్లీ సూన్ ఈ ప్రస్తావన తెచ్చారు. దేవుడు ఉన్నాడని చెప్పేందుకు గణిత ఫార్ములాకు మించిన ఆధారం ఉండదనేది ఆయన వాదన. ఓ అమెరికన్ టాక్ షోలో ఇటీవల పాల్గొన్న ఆయన ఈ గణిత ఫార్ములాకు సంబంధించి పలు విషయాలను పేర్కొన్నారు.
డా. సూన్ ప్రతిపాదన వెనుకున్న ప్రధాన సూత్రం ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్. మనకు అర్థమయ్యే భాషలో సరళంగా చెప్పుకోవాలంటే.. విశ్వాన్ని నియంత్రించే భౌతిక సూత్రాలన్నీ ఒకదానితో మరొకటి అత్యంత కచ్చితత్వంలో ఇమిడిపోయేలా ఉన్నాయి. వీటిని ఇలా రూపొందించడం వెనక ఏదో శక్తి ఉండే ఉండాలి. అంటే.. భౌతిక నియమాలు, సూత్రాలను ఇంత అందంగా నిర్మించడం యాదృచ్చికంగా జరిగిన ఘటన కాజాలదు.
ఇదే భావాన్ని డా.సూన్ గణిత ఫార్ములాలో మిళితం చేస్తే దేవుడు ఉన్నాడని రుజువు చేయొచ్చన్నారు. ఇలాంటి ఫార్ములా.. సైన్స్‌కు, మతానికి వారధిగా నిలుస్తుందని ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. జీవ జాలానికి ప్రాణం పోసేలా భౌతిక సూత్రాలన్నీ ఏర్పాటయ్యాయని ఆయన తెలిపారు. గురుత్వాకర్షణ శక్తి మొదలు, మ్యాటర్, యాంటీ మ్యాటర్ మధ్య నిష్ఫత్తి వరకూ అన్నీ జీవజాలానికి ప్రాణం పోసేలా ఉన్నాయన్న విషయాన్ని పేర్కొన్నారు. మాటర్, యాంటీమాటర్ మధ్య అసమతౌల్యాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రెండిటి మధ్య సమతౌల్యం ఉండి ఉంటే అసలు జీవం ఉనికిలోకి వచ్చేదే కాదని పేర్కొన్నారు. ఇంతటి అద్భుతమై అసమతౌల్యత ఏర్పాటు వేనక ఏదో శక్తి ఉందని అన్నారు. మనం చూస్తున్న భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక వాదానికి మధ్య ఉన్న అదృశ్య లంకె గణిత ఫార్ములానే కాగలదని చెప్పుకొచ్చారు.
Burhanpur Gold Hunt: ఛావా సినిమాతో పూనకం.. బంగారు నాణేలు తవ్వి తీసేందుకు ఎగబడ్డ గ్రామస్థులు
‘‘మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని నిర్వచించేందుకు, వివరించేందుకు గణితం అవసరం. ఇలా ఎందుకు? బహుశా దేవుడు గణితమేధావి అయ్యుంటాడు. ఈ విశ్వాన్ని అత్యున్నత గణిత సూత్రాలతో నిర్మించి ఉండొచ్చు’’ అని 1963లో ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డా.పాల్ డైరాక్ అన్నారు. నాటి మాటలన్ని కూడా డా.సూన్ తన వాదనకు ఆధారంగా చేసుకున్నారు.