Burhanpur Gold Hunt: ఛావా సినిమాతో పూనకం.. బంగారు నాణేలు తవ్వి తీసేందుకు ఎగబడ్డ గ్రామస్థులు
ABN , Publish Date - Mar 08 , 2025 | 03:14 PM
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో గుప్త నిధుల తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అక్కడ బంగారం నిధి ఉండొచ్చని ఛావా సినిమాలో పేర్కొనడంతో జనాలు పూనకాలు వచ్చినట్టు తవ్వకాలకు దిగుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: అది అర్ధరాత్రి.. రహదారులన్నీ నిర్మానుష్యంగా ఉండాల్సిన సమయం. కానీ అక్కడ మాత్రం భారీగా కోలాహలం. టార్చ్ లైట్లు, పలుగుపారలతో జనాలు పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టారు. ఎవరికి తోచిన చోట వారు తవ్వడం ప్రారంభించారు. కొందరు మెటల్ డిటెక్టర్లను కూడా తెచ్చుకొచ్చారు. ఇలా గ్రామం మొత్తం పూనకం వచ్చినట్టు తవ్వకాలు మొదలెట్టింది. ఎందుకిదంతా.. అంటే గుప్తు నిధుల వేట. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ ప్రాంతంలో ఆసీగడ్ కోట వద్ద కనిపించిన దృశ్యం ఇది. జనాలకు ఇలా పూనకాలు రావడం వెనక ఛావా సినిమా ఎఫెక్ట్ ప్రధాన పాత్ర పోషించిందట (chhaava movie gold hunt burhanpur).
Cop Slaps Boy: ప్రధాని కాన్వాయ్ రిహార్సల్స్.. అడ్డొచ్చిన టీనేజర్ చెంప ఛెళ్లు మనిపించిన ఎస్సై
వాస్తవానికి అక్కడికి సమీపంలోని ఓ దర్గా వద్ద హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి తవ్విన మట్టిని కార్మికులు జేసీబీతో స్థానిక వ్యక్తి హరూన్ షేక్ పొలంలో పశారు. ఆ తరువాత కొందరికి అక్కడ పురాతన కాలం నాటి నాణేలు దొరికాయి. అక్కడి నుంచి రచ్చ మొదలైంది. మొఘలుల కాలం నాటి బంగారం, వెండి నాణేలు దొరికాయన్న వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో, గ్రామస్థులు గుప్త నిధుల ఆశతో అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున తవ్వకాలు ప్రారంభించారు. ప్రస్తుతం దేశాన్ని ఓ ఊపు ఊపుతున్న ఛావా మూవీ కూడా ఈ పూనకాలకు ప్రధాన కారణమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ సినిమాలో ఛావా ప్రస్తావన ఉంది. ఈ ప్రాంతానికి ఛత్రపతి శంభాజీ దండెత్తి వచ్చాడని, అక్కడి ఓ బంగారు గని కూడా ఉన్నట్టు సినిమాలో చూపించారు. దీంతో, జనాలు పూనకాలు వచ్చినట్టు గుప్త నిధుల అన్వేషణ ప్రారంభించారు. రాత్రి పగలూ తేడా జనాలు లేకుండా తమ ప్రయత్నాలు చేస్తుండటంతో ఈ ఉదంతం మీడియా దృష్టిలో పడింది.
మొఘల్ సామ్రాజ్యంలో బుర్హాన్‌పూర్ ఒకప్పుడు సిరిసంపదలతో విలసిల్లిన నగరమని చరిత్రకారులు చెబుతున్నారు. అక్కడ బంగారం, వెండి నాణేల ముద్రణాలయం కూడా ఒకటి ఉందని అంటున్నారు. ఇక యుద్ధాలు జరిగిన సందర్భాల్లో అప్పటి జనాలు తమ నగదు, నగలను భూమిలోపల పాతి పెట్టేవారు. ఈ నేపథ్యంలో అక్కడ అప్పుడప్పుడూ నాణేలు బయటపడటంతో వింతేమీ లేదని చరిత్రకారులు అంటున్నారు. అయితే, ఇలా ఇష్టారీతిన ఎవరికి తూచినట్టు వారు తవ్వకాలు జరిపితే విలువైన సంపద సాంస్కృతిక వారసత్వ సంపద కోల్పోయే ప్రమాదం ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కాగా, గుప్త నిధుల వేట కారణంగా స్థానికంగా రచ్చ జరుగుతుందటంతో పరిస్థితి సద్దుమణిగేలా చేయాలంటూ ప్రతి పక్ష కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీంతో, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ తవ్వకాలపై ఆంక్షలు విధించే యోచనలో జిల్లా యంత్రాంగం ఉన్నట్టు సమాచారం. అక్రమ తవ్వకాలు నిరోధిస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బుర్హాన్‌పూర్ ఎస్పీ పేర్కొన్నారు.