Cop Slaps Boy: ప్రధాని కాన్వాయ్ రిహార్సల్స్.. అడ్డొచ్చిన టీనేజర్ చెంప ఛెళ్లు మనిపించిన ఎస్సై
ABN , Publish Date - Mar 08 , 2025 | 09:01 AM
గుజరాత్‌లో పీఎమ్ మోదీ కాన్వాయ్ రిహార్సల్స్ సందర్భంగా సైకిల్‌పై అడ్డుగా వచ్చిన టీనేజర్‌ను ఓ ఎస్సై చెంప ఛెళ్లుమనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సదరు ఎస్సైని బదిలీ చేసినట్టు స్థానిక డీసీపీ పేర్కొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌కు సంబంధించి పోలీసులు చేపట్టిన రిహార్సల్స్‌కు అడ్డుగా వచ్చిన ఓ టీనేజర్‌ను ఎస్సై చెంప ఛెళ్లుమనిపించారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఈ ఘటన వెలుగు చూసింది (Cop Slaps Boy During PM Convoy Rehearsal Viral Video).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రధాని మోదీ కాన్వాయ్‌లో ఎటువంటి భద్రతా లోపాలు లేకుండా అధికారులు రిహార్సల్ నిర్వహించారు. ఈ క్రమంలో రోడ్డుపై కాన్వాయ్ వెళుతుండగా ఓ టీనేజర్ సైకిల్‌పై రోడ్డు మీదకు వచ్చాడు. అతడికి చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సై గఢ్వీ కుర్రాడి చెంప ఛెళ్లుమనిపించాడు. అతడి జుట్టు పట్టి లాగుతూ చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి.
‘‘బయటకు వెళ్లిన కుర్రాడు ఎంతకీ ఇంటికి రాకపోతే మేం కంగారు పడ్డాము. కానీ రాత్రి 9.30 గంటలకు అతడు రోదిస్తూ ఇంటికి వచ్చాడు. పోలీసు తనను కొట్టాడని, ఎందుకో కూడా తనకు తెలీదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పోలీస్ స్టేషన్‌కు కూడా తీసుకెళ్లాడని చెప్పాడు. మరీ ఇలా చేయి చేసుకోకుండా కుర్రాడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించి ఉంటే బాగుండేది’’ అని టీనేజర్ బంధువు ఒకరు అన్నారు.
Gold allowed on Flights: ఈ కస్టమ్స్ రూల్స్ తెలుసా.. విమాన ప్రయాణికులు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చంటే..
ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో డీసీసీ అమితా వనానీ కూడా స్పందించారు. ఎస్సై ప్రవర్తన అస్సలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. సదరు ఎస్సై మోర్బీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారని, ఆయనను కంట్రోల్ రూమ్‌కు తక్షణం బదిలీ చేసినట్టు కూడా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్ల కోసం సూరత్‌కు వచ్చారని వెల్లడించారు. అయితే, టీనేజర్‌పై చేయి చేసుకున్నందుకు సదరు ఎస్సై శాలరీ పెంపు కూడా ఏడాది పాటు నిలిపివేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, వీడియోపై మాత్రం జనాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.