Super Rat: అమాయక పౌరులను రక్షించి.. గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన ఎలుక..
ABN , Publish Date - Apr 09 , 2025 | 02:05 PM
Rat Ronin Smarter Than Human: ఎలుకల పేరెత్తగనే చాలా మంది చికాకు కలుగుతుంది. ఇవి ఇంట్లో దూరి వస్తువులను చిందర వందర చేస్తాయనేది చాలామంది అభిప్రాయం. కానీ, ఈ సూపర్ ర్యాట్ సాధారణ ఎలుకలకు భిన్నమైనది. తన ధైర్యం, తెలివితేటలతో వేలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడి గిన్నిస్ సహా ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించింది. ఇంతకీ, అదేం చేసిందంటే..
Super Rat Detects Landmines: ఎలుకజాతిలోనే కాదు. మనుషుల కంటే ఈ ఎలుక అత్యంత తెలివైనది. రోనిన్ అనే పేరుగల ఈ సూపర్ ర్యాట్ తన ధైర్యసాహసాలు, వాసన పసిగట్టే నైపుణ్యంతో గిన్నిస్ సహా అనేక ప్రపంచ రికార్డులు కొల్లగొట్టింది. అంత పెద్ద ఘనత ఏం సాధించిందని అనుకుంటున్నారా. ఈ చిట్టి ఎలుక ప్రాణాలకు తెగించి సాయం చేయడం వల్లే వేలాది మంది అమాయక ప్రజల ప్రాణాలు నిలబడ్డాయి మరి. అదెలా అని ఆశ్చర్యంగా అనిపిస్తోందా.. ఈ ఎలుక 2021 నుంచి 100కి పైగా మందుపాతరలు, పేలని ఆయుధాలను కనిపెట్టింది. ఈ ఎలుక ఇంకా ఎన్నెన్ని సాధించిందో తెలిస్తే..
100 మందుపాతరలు గుర్తించిన తొలి ఎలుక..
ఎలుకలను ప్రయోగాలకే కాక వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. కంబోడియాలో ల్యాండ్ మైన్ స్నిఫింగ్ కోసం వేలాది ఎలుకలకు శిక్షణ ఇస్తుంటారు. ఎందుకంటే ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా భూమిలో పాతిపెట్టబడిన మందుపాతరలు ఉన్నాయి. వీటిని వెలికితీయకపోతే ప్రాణాలకే ప్రమాదం. అందుకే అపోపో అనే స్వచ్ఛంద సంస్థ జంతువులకు శిక్షణ ఇస్తూ పేలని ఆయుధాలు, మందుపాతరలను కనుగొనేందుకు కృషిచేస్తోంది. వీరు ఎన్నో ఎలుకలకు ల్యాండ్ మైన్ స్నిఫింగ్‌లో శిక్షణ ఇచ్చినా రోనిన్ అనే ఎలుకే అన్నింటిలోకి అమోఘమైన తెలివితేటలుగలది. ప్రస్తుతం ప్రీహ్ విహార్ ప్రావిన్స్‌లో పనిచేస్తున్న రోనిన్ ఆగస్టు 2021 నుంచి ల్యాండ్‌మైన్‌లను గుర్తించడంలో చురుకుగా పనిచేస్తోంది. ఇది ఇప్పటివరకూ 109 ల్యాండ్‌మైన్‌లు, 15 పేలని ఆయుధాలను కనుగొన్నట్లు APOPO తెలిపింది.
దీని కంటే ముందు మాగావా అనే ఎలుక ఐదు సంవత్సరాల వ్యవధిలో 71 ల్యాండ్‌మైన్‌లు, 38 పేలని మందుగుండు సామగ్రిని కనుగొంది. ఈ సేవలకు గానూ PDSA జంతు స్వచ్ఛంద సంస్థ నుంచి ధైర్య పతకాన్ని కూడా అందుకుంది. 2022లో మాగావా వృద్ధాప్యం కారణంగా చనిపోయింది.

టాంజానియాలోని మొరోగోరోలో సోకోయిన్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్‌లోని APOPO శిక్షణా కేంద్రంలో పుట్టి పెరిగిన రోనిన్.. ఐదు సంవత్సరాల వయస్సు నుంచి ఈ రంగంలో ఒక హ్యాండ్లర్‌తో కలిసి పనిచేస్తోంది. చిన్నప్పటి నుంచీ క్లిక్కర్ శిక్షణ తీసుకుంది. అరటిపండ్లు లేదా వేరుశెనగ వంటి రుచికరమైన వంటకంతో క్లిక్ శబ్దాన్ని అనుసంధానించడం నేర్చుకుంది. ఈ విధానం రోనిన్‌ను పేలుడు పదార్థాల వాసనను ఖచ్చితంగా గుర్తించడానికి ప్రేరేపిస్తుంది. నేలపై గోకడం ద్వారా ఎలుకలు మందుపాతరలను గుర్తిస్తాయి. సాధారణంగా రోజుకు 30 నిమిషాలు పని చేస్తాయి
కంబోడియా ప్రపంచంలోనే అత్యంత భారీగా ల్యాండ్‌మైన్‌లు ఉన్న దేశాలలో ఒకటిగా ఉంది. 1998లో ముగిసిన దశాబ్దాల అంతర్యుద్ధం కారణంగా భయాందోళనలకు గురవడం వల్ల ఇక్కడ చాలా చోట్ల మందుపాతరలను పాతిపెట్టారు. వీటి పేలుళ్ల వల్ల దాదాపు 1,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ భూమి ఇప్పటికీ కలుషితమైంది. అంతేగాక, ఈ దేశంలో పేలుడు పదార్థాల కారణంగా 40,000 కంటే ఎక్కువ మంది ప్రజలు అవయవాలను కోల్పోయారు. అందుకోసమే ఎలుకల సాయంతో పేలుడు పదార్థాలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read Also: History Viral: అక్బర్ కుమార్తెతో హిందూ రాజు వివాహం.. రాజ్‌పుత్-మొఘల్ కూటమి వెనుక అసలు కథ ఇదే..
Police Death Video: తన మరణ శాసనాన్ని తానే రాసుకున్న పోలీస్.. చివరకు ఎలా చనిపోయాడో చూస్తే..
Viral Video: ఎండు ద్రాక్షను లొట్టలేసుకుని తింటున్నారా.. ఎలా తయారు చేస్తున్నారో చూస్తే.