Viral: చెల్లెలితో స్పీకర్ ఆన్ చేసి ఫోన్ సంభాషణ.. ఏకంగా రూ.18 వేల జరిమానా!
ABN , Publish Date - Feb 10 , 2025 | 09:44 PM
రైల్వే స్టేషన్‌లో సోదరితో ఫోన్‌లో స్పీకర్ ఆన్ చేసిన మాట్లాడిని ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. ఇలా బహిరంగ ప్రదేశాల్లో స్పీకర్ ఫోన్ ఆన్ చేయడం నిషిద్ధమంటూ ఓ అధికారి అతడిపై ఏకంగా 18 వేల జరిమానా విధించాడు.

ఇంటర్నెట్ డెస్క్: మన దేశంలో వాహనాలు, ఊరేగింపుల రణగొణ ధ్వనులు సర్వసాధారణంగా మారిపోయాయి. విసిగించేలా ఉన్న శబ్దాలు వింటూ ఏమీ చేయలేక అనేక మంది మౌనంగానే ఇబ్బంది పడుతుంటారు. శబ్ద కాలుష్యం విషయంలో ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయి మార్పు రాకపోవడంతో శబ్దకాలుష్యం తప్పట్లేదు. అయితే, పాశ్చాత్య దేశాలు శబ్ద కాలుష్యం, బహిరంగ ప్రదేశాల్లో ప్రజల నడవడికి సంబంధించి ఎంత నిక్కచ్చిగా ఉంటాయో చెప్పే ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది (Viral).
ఫ్రాన్స్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. డేవిడ్ అనే వ్యక్తి నాంటెస్ రైల్వే స్టేషన్‌లో తన సోదరితో స్పీకర్ ఆన్ చేసి ఫోనులో మాట్లాడం ప్రారంభించారు. ఈ క్రమంలో రైల్వే అధికారి ఒకరు సమీపించి స్పీకర్ ఆన్ చేయకుండా మాట్లాడాలని తెలిపాడు. లేకపోతే జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఇది విని డేవిడ్ కాస్త తికమక పడ్డాడు. సదరు అధికారి జోక్ చేస్తున్నాడని అనుకున్నాడు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడంపై కూడా ఆంక్షలు ఉన్నట్టు అతడు గతంలో ఎప్పుడూ వినలేదు. దీంతో, అధికారి హెచ్చరికను లైట్ తీసుకున్నాడు. యథాప్రకారం, తన సోదరితో కాల్ కొనసాగించాడు. ఇది చూసిన అధికారికి కోపం నషాళానికి అంటింది. వెంటనే మరో ఆలోచన లేకుండా డేవిడ్ వద్దకు వచ్చి ఏకంగా 150 యూరోల చలానా విధించాడు. ఆ మేరకు రిసీట్ కూడా ఇచ్చాడు. దీంతో, షాకవ్వడం డేవిడ్ వంతయ్యింది. అయితే, ఈ జరిమాన టైం ప్రకారం చెల్లించకపోవడంతో అది 200 యూరోలకు పెరిగింది. ఇలాగైతే లాభం లేదనుకున్న డేవిడ్ విషయాన్ని కోర్టులో తేల్చుకునేందుకు డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు ఓ లాయర్ సాయం కూడా తీసుకున్నాడు.
Viral: ఇది 1బీహెచ్‌కే ఇల్లు అట.. బెంగళూరులో పరిస్థితి మరీ ఇంతగా దిగజారిందా?
అయితే, స్మార్ట్ వినియోగం పెరిగిన నేపథ్యంలో శబ్ద కాలుష్యానికి సంబంధించి పలు దేశాల్లో నిబంధనలు మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్పీకర్ ఆన్ చేసి వీడియోలు చూడటం లేదా ఇతరులతో ఫోన్‌లో మాట్లాడటం కొన్ని ప్రాంతాల్లో అస్సలు అనుమతించట్లేదని కొందరు చెబుతున్నారు. మన వ్యక్తిగత విషయాలు బిగ్గరగా మాట్లాడితే శబ్దకాలుష్యంతో పాటు ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుందని చెబుతున్నారు.