Passengers Enter Train Engine: వామ్మో.. కుంభమేళాకు ఇంత క్రేజా.. సీటు దొరక్క రైలు ఇంజన్‌లోకి ఎక్కేసిన ప్రయాణికులు!
ABN , Publish Date - Feb 10 , 2025 | 07:36 PM
ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైల్లో సీటు దొరక్కపోవడంతో కొందరు ప్రయాణికులు ఏకంగా ఇంజెన్‌లోకి వెళ్లి లోపలి నుంచి గడియపెట్టుకున్నారు. వారణాసి కంటోన్మెంట్ స్టేషన్‌లో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: కుంభమేళా సంరంభం అంబరాన్ని అంటింది. దేశం నలుమూలల నుంచి జనాలు కోట్ల సంఖ్యలో యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానమాచరించి ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు. ఫిబ్రవరి 26 వరకూ కుంభమేళా జరుగుతుండటంతో మరెంతో మంది ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు క్యూకడుతున్నారు. దీంతో, రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. కుంభమేళాపై క్రేజ్ కారణంగా రవాణా సాధనాలు ముఖ్యంగా రైల్వేపై ఎంత ఒత్తిడి పెరిగిందో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు జనాలు ఏకంగా రైలు ఇంజెన్‌లోకే ఎక్కిన తీరు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు (Viral).
Viral: ఇది 1బీహెచ్‌కే ఇల్లు అట.. బెంగళూరులో పరిస్థితి మరీ ఇంతగా దిగజారిందా?
వారణాసి కంటోన్మెంట్ స్టేషన్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, రైల్లో సీటు కోసం విఫలయత్నం చేసిన కొందరు ప్రయాణికులు చివరకు రైలు ఇంజెన్‌లోకి ఎక్కేశారు. ఏకంగా 20 మంది స్త్రీపురుషులు ఇంజెన్‌లోకి ఎక్కడమే కాకుండా లోపలి నుంచి గడియ కూడా పెట్టుకున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 8న తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రయాగ్‌రాజ్ వైపు వెళుతున్న రైలు రెండవ ప్లాట్‌ఫాంపై నిలిచి ఉండగా ఈ ఉదంతం జరిగిందని జాతీయ మీడియా చెబుతోంది.
ఘటనపై వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీసులను రంగంలోకి దింపారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు రైలు ఇంజెన్‌లోని 20 మందికి నచ్చచెప్పి కిందకు దింపి మరో రైల్లో వారి గమ్యస్తానానికి పంపించారట. కాగా, రైలు ఇంజెన్‌లో అనేక కీలక వ్యవస్థలు ఉంటాయని, ఇందులోకి ఎక్కడం తప్పని అదికారులు పేర్కొన్నారు. జవనరి 13న కుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇప్పటివరకూ 40 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సంరంభం ముగిసేసరికి పర్యాటకుల సంఖ్య 50 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. భక్తుల తాకిడీ కారణంగా వారణాసిలోని రైల్వే స్టేషన్లు, దేవాలయాలు, ఘాట్‌లు, ఇతర ఆధ్యాత్మిక స్థలాల్లో రద్దీ పీక్స్‌కు చేరుకుంది.