Lightning: విమానంపై పిడుగు పడితే ఏమవుతుందో తెలుసా.. చివరిసారి ప్రమాదం ఎప్పుడు జరిగిందంటే..
ABN , Publish Date - Aug 13 , 2025 | 09:20 PM
వర్షాల సమయంలో గాల్లో ఎగురుతున్న విమానం ఏదో ఒక సమయంలో పిడుగుపాటుకుగురికాక తప్పదు. అయినా ప్రయాణికులకు ఏమీ కాదు. ఇందుకోసం విమానంలో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, చివరిసారి ఇలాంటి ప్రమాదం ఎప్పుడు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
భారీ వర్షాలు కురిసే సమయంలో పిడుగు పడి మనుషులు, జంతువులు చనిపోవడం తరచూ చూస్తుంటాం. పిడుగు శబ్ధం వినిపించగానే చెవులు మూసుకోవడమూ లేదా సురక్షిత ప్రాంతాలకు పారిపోవడం చేస్తుంటాం. భూమి మీద అయితే ఎదోటి చేయొచ్చు.. మరి గాల్లో అంతెత్తున ఎగురుతున్న విమానం పరిస్థితి ఏంటి. వర్షాల సమయంలో విమానంపై పిడుగు పడితే ఏం జరుగుతుంది.. గతంలో ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడైనా జరిగాయా.. వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాల సమయంలో గాల్లో ఎగురుతున్న విమానం (Plane) ఏదో ఒక సమయంలో పిడుగుపాటుకు (Lightning) గురికాక తప్పదు. ప్రతి ఏడాదీ సుమారు 1,000 విమానాల వరకూ పిడుగుపాటుకు గురవుతుంటాయట. అయితే మరి లోపల ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటీ.. అనే సందేహం రావొచ్చు. ఎన్ని పిడుగులు పడినా విమానంలో ఉన్న వారికి ఏమీ కాదు. ఎందుకంటే పిడుగుపాటును తట్టుకునే వ్యవస్థ విమానాల్లో రూపొందించబడి ఉంటుంది. ప్రస్తుత ఆధుని విమాలన్నీ ఫెరడే కేజ్ అనే సూత్రంపై తయారు చేయబడ్డాయి. ఈ నిర్మాణాన్ని ప్రత్యేకమైన లోహంతో సిద్ధం చేస్తారట. ఇది విద్యుత్‌ను విమానంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది.

పిడుగుపడగానే ఏమవుతుందంటే..
విమానంపై పిడుగు పడగానే ముందు భాగాన్ని తాకి.. లోపల ఉండే లోహ నిర్మాణం గుండా ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లిపోతుంది. దీనివల్ల విమానంలోని యంత్రాలకు కానీ, మనుషులకు కానీ ఏమీ కాదన్నమాట. విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడానికి విమానాను ప్రత్యేకమైన గ్రౌండింగ్ వ్యవస్థలతో పాటూ సాంకేతికతతో తయారు చేస్తారు. విమాన విడిభాగాలను కాంపోజిట్, లోహాలతో తయారు చేస్తారు. తద్వారా విద్యుత్ లోపలికి చొరబడదు. అలాగే విమానం రెక్కల చివర్లో చిన్న చిన్న లోహపు రాడ్లు కూడా ఉంటాయి. పిడుగు పడగానే ఆ విద్యుత్ ఈ లోహపు రాడ్ల గుండా ప్రయాణించడం వల్ల లోపలికి వెళ్లే అవకాశం ఉండదు.

చివరి ప్రమాదం ఎప్పుడు జరిగిందంటే..
విమానంపై పిడుగుపడి అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. 1963లో చివరి కేసు నమోదైంది. ఆ ఏడాది డిసెంబర్ 8న అమెరికాలో ఈ ప్రమాదం జరిగింది. పాన్ యామ్- 214 అనే విమానం ప్రయాణికులతో శాన్ జువాన్ నుంచి బాల్టిమోర్, ఫిలడెల్ఫియాకు వెళ్తుండగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాల్లో ఉండగా ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో పిడుగు పడింది. ఈ ప్రమాదంలో విమానంలో మంటలు చెలరేగాయి. అలాగే ఒక రెక్క కూడా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో 81 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదం తర్వాత విమానాల తయారీపై ప్రత్యేక దృష్టి సారించి, సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత పిడుగుపాటు ప్రమాదాలు పూర్తిగా తప్పిపోయాయి.
ఇవి కూడా చదవండి..
ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..
ప్రియురాలి అత్యుత్సాహం.. రెండో అంతస్తులో పరుగెత్తుకుంటూ రావడంతో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి