Sleeper Bus Travel: ఐరోపా వాళ్లు బాగా వెనకబడ్డారు.. భారతీయ స్లీపర్ బస్‌లో జర్నీపై కెనడా వ్యక్తి కామెంట్
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:59 PM
భారతీయ స్లీపర్ బస్‌లో జర్నీ అద్భుతంగా ఉందంటూ ఓ కెనడా యువకుడు పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంటర్నె్ట్ డెస్క్: భారతీయ స్లీపర్ బస్సులో ప్రయాణించిన ఓ కెనడా పర్యాటకుడు ప్రశంసలు కురిపించారు. ఇలాంటివి ఐరోపా దేశాల్లో కూడా లేవని పేర్కొన్నారు. అతడు పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. కోల్‌కతాలో అతడు ఈ బస్సులో ప్రయాణించాడు (Canadian On Indian Sleeper Bus Travel).
బస్సు ఎక్కే ముందు అతడు ఈ వీడియోను రికార్డు చేయడం ప్రారంభించాడు. ‘ఐరోపా బస్సులు వీటికి సాటి రావు’ అని కామెంట్ చేశాడు. ఆ తరువాత బస్సులోపలి విశేషాలను పంచుకున్నాడు. ‘ఇది అద్భుతంగా ఉంది. ఒక్కో ప్రయాణికుడికి ప్రత్యేకంగా బెడ్ ఉంటుంది. బిస్కెట్స్, మంచి నీళ్ల బాటిల్, బ్లాంకెట్ కూడా ఇచ్చారు. ఇందులో ప్రయాణిస్తే హాయిగా నిద్రపోవచ్చు. మరుసటి రోజు ఎలాంటి అలసట లేకుండా మరో నగరంలో నిద్ర లేవచ్చు. ఇందులో క్యాబిన్స్ అద్భుతంగా ఉన్నాయి. కర్టెన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ బోలెడంత ప్రైవసీ ఉంది. నెక్ట్స్ టైమ్ మీ ఫ్రెండ్స్‌తో కలిసి భారత్ వచ్చినప్పుడు ఓ 15 డాలర్లు చెల్లించి ఈ బస్సు ఎక్కండి’ అని ఇతర కెనడా వాసులకు సలహా కూడా ఇచ్చాడు.
ఇక ఈ వీడియోపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు 17 లక్షల వ్యూస్ వచ్చాయి. వేల కొద్దీ కామెంట్స్ వచ్చిపడ్డాయి. భారత్‌లో మంచి విశేషాలను హైలైట్ చేసినందుకు అతడిని అనేక మంది ప్రశంసించారు. ‘పాత బస్సుల్లో జర్నీలను వీడియో తీస్తూ భారత్ అంతా ఇలాగే ఉంటుందన్న దురభిప్రాయం కలుగుచేయనందుకు నీకు చాలా థ్యాంక్స్’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ‘తక్కువ ఖర్చు పెట్టి భారత్‌లో వసతులు బాగాలేవని కొందరు అంటుంటారు. నీవు అలా చేయనందుకు అభినందించాల్సిందే’ అని అన్నారు. ఆ రూట్‌లో మరికొన్ని బస్సుల్లో ఇన్‌ఫోటెయిన్‌మెంట్ కూడా ఉంటుందని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో విపరీతంగా వ్యూస్ రాబడుతోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..