Bite of Dead Snake: గడ్డియంత్రంలో పడి ముక్కలైన పాము.. యువతిని కాటేయడంతో..
ABN , Publish Date - Oct 27 , 2025 | 10:29 AM
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాము కాటేయడంతో 18 ఏళ్ల బాలిక దుర్మరణం చెందింది. పాముల బైట్ రిఫ్లెక్స్ కారణంగా ఇలాంటి ప్రమాదం ఎదురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అసాధారణ రీతిలో పాము కాటుకు గురై ఓ టీనేజ్ బాలిక మరణించిన ఘటన ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. మోరినా జిల్లాలో ఆదివారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది (Morena district snake incident).
జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌదండా గ్రామంలో ఈ షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. రామ్‌పూర్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పశువులకు మేత వేసేందుకు భారతి కుష్వాహా (18) తన ఇంట్లో యంత్రంతో గడ్డిని కోయడం ప్రారంభించింది. ఈ క్రమంలో గడ్డిలో దాక్కున్న పాము యంత్రానికి చిక్కి మూడు ముక్కలైంది. ఇది తెలియని బాలిక గడ్డి మోపును పైకెత్తడంతో తెగిపడిన పాము తల టీనేజర్‌ను కాటు వేయడంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది.
కుటుంబసభ్యులు తొలుత ఆమెను సంప్రదాయక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. ఆ తరువాత పరిస్థితి విషమించడంతో ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో, ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, బాధిత కుటుంబానికి పరిహారం అందుతుందని పోలీసులు తెలిపారు.
పాము కాటుకు కారణం ఇదీ..
ఇలాంటి సందర్భాల్లో పాము కాటుకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పాము తల తెగిపడినా కొంత సేపటి వరకూ దానికి కాటేసే గుణం మిగిలే ఉంటుందని చెబుతున్నారు. శాస్త్రపరిభాషలో దీన్ని బైట్ రిఫ్లెక్స్ అని పిలుస్తారు. పాముకు సహజసిద్ధంగా ఉన్న రక్షణ వ్యవస్థల్లో ఇదో భాగం. చచ్చిపోయిన తరువాత కూడా పాము దవడల్లోని కండరాలు అసంకల్పితంగా స్పందించినప్పుడు ఇలా జరుగుతుందని వివరిస్తున్నారు.
ఇవీ చదవండి:
భారత్‌కు తిరిగొచ్చేయండి.. ఎన్నారైలకు శ్రీధర్ వెంబు అభ్యర్థన
తండ్రి ప్రేమ అంటే ఇదీ.. కూతురి కోసం దీపావళి నాడు..