Swords with Swastika Discovered: ఫ్రాన్స్‌లో 2300 ఏళ్ల నాటి పురాతన ఖడ్గాలు లభ్యం
ABN , Publish Date - May 05 , 2025 | 10:05 PM
ఫ్రాన్స్‌లో తాజాగా 2300 ఏళ్ల నాటి రెండు ఖడ్గాలు బయటపడ్డాయి. వీటి ఒరలపై స్వస్తిక చిహ్నాలు ఉండటం శాస్త్ర ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్‌లో సుమారు 2300 ఏళ్ల నాటి రెండు ఖడ్గాలను తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ఖడ్గాలున్న ఓరలుపై స్వస్తిక చిహ్నాలు కూడా ఉండటంతో శాస్త్రప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఫ్రాన్స్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియలాజికల్ రీసెర్చ్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తల బృందం జరిపిన తవ్వకాల్లో ఈ ఖడ్గాలు బయటపడ్డాయి. ఫ్రాన్స్‌లోని క్రూజూయిర్ లీ నాఫ్ ప్రాంతంలో ఈ తవ్వకాలు జరిపారు. ఈ సందర్భంగా ఖడ్గాలతో పాటు సమాధుల్లో ఉంచే ప్రత్యేక వస్తువులు కూడా బయటపడ్డాయి. సమాధుల్లో పెట్టేందుకు కొన్ని బ్రేస్‌లెట్స్ వంటి ఆభరణాలు కూడా లభించాయి. వీటిని రాగి ఉన్న లోహమిశ్రమంతో తయారు చేసినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇక ఖడ్గాలు ఉంచే ఒరలకు తళుకు రాళ్లు కూడా పొదిగి ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ ఖడ్గాలు సెల్టిక్ ప్రజలవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, ఖడ్గాల ఒరలపై ఉన్న స్వస్తిక గుర్తుల ప్రాధాన్యంపై అస్పష్టత ఉందని శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన విన్సెంట్ జార్జెస్ తెలిపారు. స్వస్తిక గుర్తుకు ఒక్కో ప్రాంతంలోని ప్రజలు ఒక్కో అర్ధాన్ని చెప్పుకున్నారని వివరించారు. మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న వారికి స్వస్తిక కేవలం అలంకారానికి అనుగూణమైన డిజైన్‌యేనని అన్నారు.
ఎవరీ సెల్టిక్ ప్రజలు
బ్రాంజ్ ఏజ్ కాలంలో పశ్చిమ, మధ్య ఐరోపా ప్రాంతాల్లో నివసించిన ప్రజలను సెల్టిక్ జాతుల ప్రజలని పిలుస్తారు. ఫ్రాన్స్, బెల్జియం, బ్రిటన్, ఐర్లాండ్, స్పెయిన్, పోర్చుగల్ ప్రాంతాల్లో వీరు ఉండేవారని శాస్త్రవేత్తలు చెబుతారు. ఆయా ప్రాంతాల్లో నివసించే వేర్వేరు తెగల వారిని ఉమ్మడిగా సెల్టిక్ జనాలుగా పిలుస్తారని శాస్త్రవేత్తలు చెబుతన్నారు. వారి సంస్కృతి ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని, ఐరిష్, వెల్ష్, బ్రెంటన్ భాషలకు సెల్టిక్ మూలాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ తెగల మధ్య భాష, కళలు, యుద్ధరీతులు, అంత్యక్రియల విధనాల్లో అనేక సారూప్యతలు ఉండేవి.
ఇవి కూడా చదవండి:
భారతీయులు కాస్తంత మర్యాదగా నడుచుకుంటే మంచిదంటున్న కెనడా పౌరుడు
వాన పడుతోందని వర్క్ ఫ్రమ్ హోం అడిగిన ఉద్యోగి.. చివరకు జరిగిందంటే..
మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..