Water Falls : భారతదేశంలో తప్పకుండా చూడాల్సిన 8 ఫేమస్ వాటర్ ఫాల్స్..
ABN, Publish Date - Mar 08 , 2025 | 05:59 PM
Famous Waterfalls In India : భారతదేశం ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన జలపాతాలకు నిలయం. మీరు ఈ సారి ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఈ 8 జలపాతాల్లో ఒక్కటైనా తప్పకుండా సందర్శించండి.

1. నోహ్స్ంగిథియాంగ్, మేఘాలయ నోహ్స్ంగిథియాంగ్ జలపాతాన్ని 'సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్స్' అని కూడా పిలుస్తారు. ఒక దట్టమైన కొండపై 7 వాగులు కలిసి జాలువారడం వల్ల ఈ పేరొచ్చింది. ఈ ప్రాంతాన్ని వర్షాకాలంలో సందర్శిస్తే తప్పక ఆనందిస్తారు.

2. అథిరపిళ్లై జలపాతం, కేరళ అందమైన అథిరపిళ్లై జలపాతం దగ్గరే బాహుబలి, దిల్ సే వంటి సూపర్ హిట్ చిత్రాలు షూట్ చేశారు. వర్షకాలం లేదా శీతాకాలం ఈ జలపాతపు అందాలను ఆస్వాదించేందుకు మంచి సమయం.

3. దూద్‌సాగర్ జలపాతం, గోవా దూద్‌సాగర్ జలపాతాన్ని ముద్దుగా 'పాల సముద్రం' అని పిలుచుకుంటారు పర్యాటక ప్రియులు. తెల్లని పాల నురగలా గలగలా రాళ్లపై ప్రవహించే నీటి సవ్వడి ప్రకృతి చేసిన అద్భుత వింతలా కనిపిస్తుంది. వర్షాకాలం, వర్షాకాలం తర్వాత ఈ ప్లేస్ చుట్టేయండి.

4. జోగ్ జలపాతం, కర్ణాటక జోగ్ జలపాతం భారతదేశంలోనే రెండవ ఎత్తైన జలపాతం. ఇది ఏకంగా 830 అడుగుల ఎత్తు నుండి దూకుతుంది. ఈ జలపాతం సాహస ప్రియులకు అనువైనది. పర్యటించేందుకు ఉత్తమ సమయం వర్షాకాలం.

5. తలకోన జలపాతం, ఆంధ్రప్రదేశ్ తలకోన జలపాతం శ్రీ వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం లోపల ఉంది. ఇది ట్రెక్కింగ్‌కు గొప్ప ప్రదేశం. అక్టోబర్ నుండి జనవరి వరకు ఈ జలపాతపు అందాలను చూసేందుకు పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు.

6. హోగేనక్కల్ జలపాతం, తమిళనాడు కన్నడలో హోగేనక్కల్ అంటే "పొగ మరియు రాళ్ళు" అని అర్థం. జలపాతం పొగమంచు రూపాన్ని తెలియజెప్పేలా దీనికి పేరు పెట్టారు. సందర్శనకు ఉత్తమ సమయం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు.

7. చచాయ్ జలపాతం, మధ్యప్రదేశ్ భారతదేశంలోని ఎత్తైన సింగిల్-డ్రాప్ జలపాతాలలో చాచాయ్ ఒకటి. ఉద్ధృతంగా సాగే దీని ప్రవాహ సవ్వడికి ఎవ్వరైనా వారెవ్వా అనాల్సిందే. . ఆగస్టు నుండి ఫిబ్రవరి మధ్య ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు చక్కటి సమయం.

8. దస్సం జలపాతం, ఝార్ఖండ్ 10 నీటి ప్రవాహాలు ఒకదానికొకటి కలిసి ప్రవహిస్తే ఏర్పడిందే దస్సం జలపాతాన్ని. పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే దృశ్యాలే దీన్ని ప్రత్యేకంగా నిలిపాయి. పర్యటించేందుకు ఉత్తమ సమయం వర్షాకాలం.
Updated at - Mar 08 , 2025 | 06:05 PM