ఓటేయండి.. ఆఫర్ ఈయండి.. అన్నీ ఫ్రీ..ఫ్రీ
ABN, Publish Date - Jan 24 , 2025 | 09:51 PM
న్యూఢిల్లీ: ''అంతా ఫ్రీ...అన్నీ ఫ్రీ... మీ అమూల్యమైన ఓటు మాకు వేసి గెలిపిస్తే చాలు'' ఇదే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కీలక మంత్రంగా మారింది. డిసెంబర్ 5వ తేదీ 'బిగ్ డే' కోసం ఊహాల పల్లకిలో ఓటర్లను తేలియాడేలా చేస్తూ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న బీజేపీ, ఆ రెండు పార్టీలకూ ప్రత్నామాయం తామేనంటూ కాంగ్రెస్ పార్టీ 'ఉచిత తాయిలాలు'' గుప్పిస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, రోడ్లు, నీళ్లు, ఎల్పీజీ, మహిళలకు ఆర్థిక సాయం వంటివి అన్ని పార్టీల కామన్ అజెండాలో ఉండటం ఆసక్తికరం.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం వెనుక 'ఉచిత' హామీల పాత్ర ప్రధానంగా ఉంది.

నగదు బదిలీతో పలు సహా సంక్షేమ పథకాలు రెండుసార్లు ఆప్‌ను అధికారంలోకి తేవడంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా సంక్షేమ పథకాలపై వెనక్కి తగ్గడం లేదు.

200 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచిత సరఫరా. 200 యూనిట్లు దాటితే 50 శాతం సబ్సీడీ ఇస్తామని ఆప్ ప్రకటించింది.

ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని యథాతథంగా అమలు చేస్తామని బీజేపీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది.

సంజీవని యోజన పథకం' కింద సీనియర్ సిటిజన్లకు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామని, ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని ఆప్ తమ మేనిఫెస్టోలో ప్రకటించింది.

బీజేపీ 'ఆయుష్మాన్ భారత్' పథకం కింద సీనియర్ సిటిజన్లు, పేద కుటుంబాలకు రూ.10 లక్షల వరకూ హెల్త్ కవర్ కల్పిస్తామని భరోసా ఇచ్చింది.

గతంలో ప్రకటించిన పెన్షన్ స్కీమ్‌ను విస్తరిస్తామని ఆప్ ప్రకటించింది. అదనంగా మరో 80,000 మందికి ఈ సౌకర్యం విస్తరిస్తామని తెలిపింది. 60-69 ఏళ్ల మధ్యనున్న వారికి రూ.2,000 చొప్పున, 70 ఏళ్లు పైబడిన వారికి, 60-69 మధ్య వయస్కులైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లబ్దిదారులకు రూ.2.5000 చొప్పున నెలవారి పెన్షన్‌కు వాగ్దానం చేసింది

అదనంగా దివ్యాంగులకు నెలసరి రూ.5,000 పెన్షన్ ఇస్తామని తెలిపింది. -బీజేపీ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ కింద నెలసరి పేజౌట్‌ను రూ.2,000 నుచి 2,500కు పెంచుతామని హామీ ఇచ్చింది.

ఆప్ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించగా, పాఠాశాలలు, కళాశాలల విద్యార్థులకు కూడా ఈ సౌకర్యాన్ని వర్తిస్తామని, మెట్రో రైల్ ఫేర్స్‌లో 50 శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది.

బీజేపీ సైతం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఎల్పీజీ సబ్సిడీ రూ.500, హోలీ, దీపావళి పండుగలకు ఇచిత సిలెండర్ హామీని బీజేపీ ఇచ్చింది.
Updated at - Jan 24 , 2025 | 09:57 PM