Share News

Srinivasa Kalyanam In Britain: లీడ్స్‌ హిందూ మందిరంలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

ABN , Publish Date - Sep 23 , 2025 | 02:25 PM

బ్రిటన్‌లోని లీడ్స్ హిందూ మందిరంలో ఘనంగా శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించారు. టీటీడీ అధికారులు, పురోహితులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. బ్రిటన్‌లోని పలు తెలుగు సంఘాలు ఈ కల్యాణోత్సవం విజయవంతం కావడంతో.. కీలక భూమిక పోషించాయి.

Srinivasa Kalyanam In Britain: లీడ్స్‌ హిందూ మందిరంలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

ప్రపంచవ్యాప్తంగా తెలుగు భక్తుల్లో భారతీయ సంస్కృతి వెలుగులు నింపే లక్ష్యంతో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. శ్రీవెంకటేశ్వర స్వామి వారి కృపతో భక్తులు శ్రేయస్సు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తాజాగా బ్రిటన్‌లోని లీడ్స్ హిందూ మందిరంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Leeds-2.jpg


తిరుమలకు చెందిన ప్రధాన అర్చకులు శ్రీ రంగనాథ్ ఆధ్వర్యంలో.. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఎదుర్కోలు, కంకణ ధారణ, వరమాలల మార్పిడి, మంగల్య ధారణ తదితర ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమ దృశ్యాలు భక్తుల హృదయాలను భక్తి రసంలో ముంచెత్తాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో యేకాంత్, అంబి చాళికి, ఆనంద్‌లు కీలకంగా వ్యవహరించారు.

Leeds-03.jpg


తిరుమల శ్రీ వారి కరుణా కటాక్షంతోపాటు అందరి సమన్వయం వల్లే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగిందని నిర్వహాకులు ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే ఈ శ్రీనివాస కళ్యాణం నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ స్వామి వారి కళ్యాణానికి బ్రిటన్‌లోని వివిధ నగరాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు, భక్తులు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం టీటీడీ ప్రసాదంతోపాటు స్వామి వారి అక్షింతలను ఈ సందర్భంగా భక్తులకు అందజేసినట్లు చెప్పారు.

Leeds-04.jpg


ఈ శ్రీనివాస కళ్యాణాన్ని.. శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవ సమితి, ఎల్ఏటీఏ, టీటీడీ, ఏపీఎన్‌ఆర్‌టీఎస్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని టీటీడీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (AEO) మల్లికార్జున ప్రసాద్ సమన్వయ కర్తగా వ్యవహరించారు.

యూరప్ ఏపీఏఎన్‌టీ సమన్వయకర్త డా. కిషోర్ బాబు చలసాని, వెంకట్ కాట్రగడ్డతోపాటు యూనైటెడ్ కింగ్‌డమ్ ఏపీఎన్‌ఆర్‌టీ సమన్వయకర్త సురేశ్ కోరం, విజయ్ అడుసుమిల్లి, శ్రీనివాస్ గోగినేని తదితరులు .. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తానా ఆధ్వర్యంలో స్కూల్‌ బ్యాగుల పంపిణీ

సౌదీ అరేబియాలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సభ

For More NRI News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 02:31 PM