Share News

Rahul Gandhi: ఓట్ల చోరీ జరగనీయం.. ఈసీని వదలం

ABN , Publish Date - Aug 24 , 2025 | 02:47 PM

ఓట్ల చోరీ ఆరోపణలపై తామడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఈసీ విఫలమైందని రాహుల్ అన్నారు. ఎన్నికల సంఘం తటస్థంగా లేదని, ఈసీఐ, ఎన్నికల కమిషనర్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.

Rahul Gandhi: ఓట్ల చోరీ జరగనీయం.. ఈసీని వదలం
Rahul Gandhi

అరారియా: బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు సంబంధించి భారత ఎన్నికల కమిషన్ (ECI), భారతీయ జనతా పార్టీ (BJP)పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అదివారంనాడు విమర్శల దాడి కొనసాగించారు. విపక్ష పార్టీలకు వ్యతిరేకంగా ఈసీఐ, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. బిహార్‌లోని ఆరారియాలో రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజస్వి యాదవ్‌తో కలిసి మీడియా సంయుక్త సమావేశంలో రాహుల్ మాట్లాడారు. బీహార్‌లో ఓట్ల చోరీ జరగనీయమని అన్నారు. సరైన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఇవ్వాలని డిమాండ్ చేశారు.


'ఎన్నికల కమిషన్ ప్రవర్తనను మార్చడం కోసమే మేము ఒత్తిడి చేస్తున్నాం. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. బిహార్ ఎన్నికల్లో ఓట్ల చోరీని జరగనీయం. మీరు మహారాష్ట్రలో దొంగిలించారు. హర్యానాలో ఓట్ల చోరీ చేశారు. కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగినట్టు చాలా స్పష్టంగా చూపించాం. ఇక్కడ ఎంతమాత్రం ఓట్ల చోరీ జరగనీయం' అని రాహుల్ స్పష్టం చేశారు.


జవాబివ్వడంలో ఈసీ విఫలం

ఓట్ల చోరీ ఆరోపణలపై తామడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఈసీ విఫలమైందని రాహుల్ అన్నారు. ఎన్నికల సంఘం తటస్థంగా లేదని, ఈసీఐ, ఎన్నికల కమిషనర్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ అఫిడిట్ సమర్పించకుంటే ఆరోపణలు నిరాధారమని భావించాల్సి వచ్చిందని ఈసీ చెబుతోందని, అనురాగ్ ఠాకూర్ ఇదే తరహా ప్రెస్‌కాన్ఫరెన్స్ నిర్వహించినప్పటికీ ఆయనను అఫిడవిట్ సమర్పించమని అడగలేదని ఆయన పేర్కొన్నారు. మహాఘట్‌బంధన్ పోల్ మేనిఫెస్టోపై అడిగినప్పుడు, రైతులకు సంబంధించి చాలా ఐడియాలు ఉన్నాయని, రైతు ప్రయోజనాల పరిరక్షణకు మేనిఫెస్టో కమిటీ కసరత్తు చేస్తోందని చెప్పారు. మహాకూటమిలోని పార్టీలన్నీ బీహార్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.


ఓటర్ అధికార్ యాత్ర విజయవంతం

ఓటర్ అధికార్ యాత్ర విజయవంతమైందని, ప్రజలు స్వచ్ఛందంగా యాత్రలో పాల్గొంటున్నారని రాహుల్ చెప్పారు. కోట్లాది మంది బిహారీలు ఓట్ల చోరీ జరిగిందని నమ్ముతున్నారని, ఓటర్ అధికార్ యాత్రకు ప్రజల నుంచి పెద్దఎత్తున వస్తున్న మద్దతే ఇందుకు నిదర్శనమని అన్నారు. ససారాంలో ఆగస్టు 17న ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే ర్యాలీలో ముగియనుంది.


ఇవి కూడా చదవండి..

రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది

రాహుల్ యాత్రలో మళ్లీ అపశృతి

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 02:49 PM