Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 10 కీలక బిల్లులు... డిసెంబర్ 1 నుంచి ప్రారంభం
ABN , Publish Date - Nov 29 , 2025 | 05:50 PM
డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలకమైన పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికేందుకు ఉద్దేశించిన 'ది ఆటమిక్ ఎనర్జీ బిల్లు-2025'తో సహా 10 కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament Winter Sessions) డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19వ తేదీ వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి. సమావేశాలకు ముందు సంప్రదాయంగా నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ అఖిలపక్ష సమావేశం జరుగనుంది. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని కేంద్రం కోరనుంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలకమైన పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికేందుకు ఉద్దేశించిన 'ది ఆటమిక్ ఎనర్జీ బిల్లు-2025'తో సహా 10 కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
బిల్లులు ఇవే..
పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కీలకమైన బిల్లులలో 'ది ఆటకమిక్ ఎనర్జీ బిల్లు-2025'తో పాటు సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు (ఎస్ఎంసి)-2025, జాతీయ రహదారుల (సవరణ) బిల్లు, అర్బిట్రేషన్, కాన్సిలియేషన్ (సవరణ) బిల్లు, ఇన్సూరెన్స్ చట్ట (సవరణ) బిల్లు, ఇన్సాల్వెన్సీ, దివాలా కోడ్ (సవరణ) బిల్లు, కార్పొరేట్ చట్ట (సవరణ) బిల్లు, ది హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు-2025, ది మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (సవరణ) బిల్లు-2025, జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు-2025 ఉండనున్నాయి.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చట్టం-1992, డిపాజిటరీస్ చట్టం-1996, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (నియంత్రణ) చట్టం-1956లను విలీనం చేసేందుకు 'సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు-2025'ను కేంద్రం తీసుకువస్తోంది. జాతీయ రహదారుల విస్తరణ, పొడిగింపుకోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగంగా, అత్యంత పారదర్శకంగా జరిగేందుకు వీలుగా నేషనల్ హైవేస్ (సవరణ) బిల్లును తెస్తోంది. చేయని తప్పులకు కంపెనీ డైరెక్టర్లు బాధ్యలు అవుతున్నందున అవాంఛనీయ దర్యాప్తు, విచారణల నుంచి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్బిట్రేషన్, కాన్సిలేయేషన్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనుంది. దీనిపై సూచనల కోసం కమిటీకి సిఫారసు చేసే అవకాశం ఉంది. కాగా, ది హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లుతో ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకురానుంది. కాగా, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 240వ అధికరణ పరిధిలోకి తెచ్చే బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడతారని అనుకున్నప్పటికీ అలాంటి ఆలోచన ఏదీ లేదని ఇటీవల కేంద్రం ప్రకటించింది.
కాగా, ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పలు అంశాలను లేవనెత్తేందుకు విపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రధానంగా ఎస్ఐఆర్ ఓటర్ల సవరణ జాబితా, అదానీ అంశం, ఢిల్లీ పొల్యూషన్ వంటి అంశాలను లేవనెత్తే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి..
గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ ఎన్ఐఏ కస్టడీ డిసెంబర్ 5 వరకూ పొడిగింపు
ఈడీ ఛార్జిషీటుపై నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసిన కోర్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి