Share News

Crime News : దారుణం.. సీటు బెల్ట్‌తో ఉరేసి.. తలను వేరు చేసి..

ABN , Publish Date - Dec 15 , 2025 | 08:14 PM

ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సహజీవనం చేస్తున్న జంటల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. రెండేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ప్రియుడు.

Crime News : దారుణం.. సీటు బెల్ట్‌తో ఉరేసి.. తలను వేరు చేసి..
Uttar Pradesh Incident

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సహరాన్‌పూర్‌కి చెందిన బిలాల్ అనే యువకుడు ఉమ అనే వివాహితతో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ మధ్య బిలాల్‌కు వివాహం నిశ్చయం అయ్యింది. పెళ్లైతే బిలాల్ తనకు దూరమవుతాడన్న భయంతో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది ఉమ. అంతేకాదు మరో యువతిని పెళ్లి చేసుకుంటే.. తమ అక్రమ సంబంధం బయటపెడతా అంటూ బెదిరించింది. దాంతో తన పెళ్లి జరగాలంటే ఉమ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు బిలాల్.


ఈ క్రమంలోనే హిమాచల్‌ప్రదేశ్ టూర్‌కి వెల్దామని ఉమా నమ్మించి తన కారులో ఎక్కించుకున్నాడు. హర్యానాలోని బలహదూర్‌గఢ్ వద్ద నిర్మానుష్య ప్రదేశం రాగానే కారులోని సీటు బెల్ట్‌తో ఉరివేశాడు. ఉమ చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఎవరూ గుర్తు పట్టకుండా కత్తితో తలను వేరు చేసి మొండాన్ని దగ్గరలోని పొలంలో పడేశాడు. మరికొంత దూరంలో తలను విసిరివేశాడు. ఉమ కనిపించడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హర్యానా పోలీసులు మొండాన్ని స్వాధీనం చేసుకొని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు.


DSP రజత్ గులియా నేతృత్వంలో విచారణ కొనసాగింది. మృతురాలు ఎవరు అనేది గుర్తించడానికి సీసీ‌ఫుటేజ్‌ని తనిఖీ చేశారు. హత్నీకుంద్ బ్యారేజ్ వద్ద ఓ కారులో ఆ మహిళ ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. అన్ని యాంగిల్స్‌లో విచారణ చేయగా హంతకుడు బిలాల్ తేలింది. అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేయగా అసలు విషయం బయటపెట్టాడు. అంతేకాదు తలను లాల్ ధాంగ్ ప్రాంతంలో విసిరివేసినట్లు తెలిపారు. తన పెళ్లికి అడ్డు వస్తుందన్న కారణంతోనే చంపేసినట్లు ఒప్పుకున్నాడు. ఆమెకు అప్పటికే వివాహం అయ్యిందని, 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడని బిలాల్ చెప్పాడు. భర్త, కొడుకును వదిలేసి రెండేళ్లుగా తనతో సహజీవనం చేస్తుందని పోలీస్ విచారణలో తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.


ఇవీ చదవండి:

అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!

జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..

Updated Date - Dec 15 , 2025 | 08:14 PM