Javelin Missiles: ఇండియాకు 'జావెలిన్ మిస్సైల్'.. దీని గురించి తెలుసా.?
ABN , Publish Date - Nov 20 , 2025 | 03:54 PM
భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో భారీ సామర్థ్యంతో కూడిన ఆయుధాలను భారత్‌కు విక్రయించనుంది అగ్రరాజ్యం. ఈ ఆయుధాలు మన దేశ రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయడం సహా ప్రాంతీయ ముప్పులనూ ఎదుర్కొనేందుకు ఉపకరిస్తాయని అమెరికా పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, అమెరికా దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత్ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేదిశగా యూఎస్.. 93 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో సుమారు రూ.770 కోట్లు) ఆయుధాలను విక్రయించేందుకు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంతో అధునాతన 'జావెలిన్ మిస్సైల్ సిస్టమ్(Javelin Missile System)' దేశానికి రానుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన జావెలిన్ క్షిపణి.. ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ రెండు దేశాల యుద్ధంలో కీలకంగా నిలిచిన 'జావెలిన్' ప్రత్యేకత ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?
అసలేంటీ జావెలిన్.?
ఎఫ్‌జీఎం-148 జావెలిన్ అనేది ఒక మనిషి మోయగలిగే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్(ఏడీజీఎం). అనగా ఇదో ట్యాంక్ విధ్వంసకర క్షిపణి. దీనిని పెద్ద తుపాకీలా భుజంపై ఉంచుకుని శత్రువుల ట్యాంకులపై గురిపెట్టి ప్రయోగించవచ్చు. సాయుధ వాహనాలు(ట్యాంకులు), బంకర్లు, బలమైన స్థావరాలను కచ్చితత్వంతో నాశనం చేయగలదీ క్షిపణి. దీనిని ఒకసారి ప్రయోగించాక మరలా కంట్రోల్ చేయాల్సిన అవసరముండదు. క్షిపణిలో అమర్చిన ఇన్‌ఫ్రారెడ్ సీకర్.. తనంతట తానుగా లక్ష్యంవైపు దూసుకెళ్లి, ఛేదిస్తుంది. దీన్ని కంప్యూటర్ సాయంతో నియంత్రిస్తారు. అంటే ఆపరేటర్ దీన్ని ప్రయోగించిన తర్వాత సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోవచ్చు. దీంతో జావెలిన్ ఎక్కడి నుంచి ప్రయోగించారనే విషయం శత్రు సైన్యానికి కచ్చితంగా తెలిసే అవకాశముండదు.
దీనిలో సుమారు మూడున్నర అడుగుల మిస్సైల్, డిస్పోజబుల్ లాంఛ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ వంటివి ఉంటాయి. అంతేకాకుండా రెండు పేలుడు పదార్థాలనూ వీటిలో అమర్చుతారు. ఇవి రీయాక్టివ్ ఆర్మర్ రక్షణ కవచాలను ఛేదించడం సహా ట్యాంకును ధ్వంసం చేస్తాయి. వీటిని అమెరికాకు చెందిన రేథియాన్, లాక్‌హిడ్ మార్టీన్ అనే రక్షణ రంగానికి చెందిన సంస్థలు అభివృద్ధి చేశాయి. వీటిని తయారు చేయడం చాలా క్లిష్టతతో కూడిన పని, పైగా ఖర్చూ చాలా ఎక్కువే. ఒక్కో మిస్సైల్ ధర సుమారు 2 లక్షల డాలర్ల వరకు ఉంటుందని సమాచారం.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జావెలిన్ క్షిపణులను విపరీతంగా ప్రయోగించింది ఉక్రెయిన్. దీని సాయంతో రష్యాకు చెందిన పలు యుద్ధ ట్యాంకులను మట్టికరిపించింది. ఈ క్షిపణుల నుంచి రక్షణ పొందేందుకు రష్యా.. తమ ట్యాంకులపై ఏకంగా ఇనుప బోన్లను అమర్చింది. అలా ఉక్రెయిన్‌కు అత్యంత కీలకంగా వ్యవహరించిందీ మిస్సైల్.
రెండు విడతల్లో..
అమెరికా విదేశాంగ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆయుధ ఒప్పందం అమెరికా-భారత్ వ్యూహాత్మక సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మొత్తం 93 మిలియన్ డాలర్ల ఆయుధాలను విక్రయించేందుకు ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో 47.5 మిలియన్ డాలర్ల విలువైన జావెలిన్ క్షిపణి వ్యవస్థలు సహా సంబంధిత హార్డ్‌వేర్ పరికరాలు రానున్నాయి. మరో 47.1 మిలియన్ డాలర్ల విలువైన ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్ వంటి పరికరాలను అగ్రరాజ్యం అందించనుంది. ఈ ఒప్పందంలో భాగంగా.. తొలి విడతలో ఎఫ్‌జీఎం-148 మిస్సైల్స్, 25 జావెలిన్ లైట్ వెయిట్ కమాండ్ లాంఛ్ యూనిట్లు భారత్‌కు రానున్నాయి. ఈ ఆయుధాలు మన దేశ రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం సహా ప్రాంతీయ ముప్పులను అరికట్టేందుకు తోడ్పడతాయని అగ్రరాజ్యం పేర్కొంది.
యూకే నుంచీ..
భారత సైన్యం ఈ ఏడాది వాయు రక్షణను పటిష్ఠ పరిచేందుకు యూకేకు చెందిన థేల్స్‌తో లైట్ వెయిట్ మాడ్యులర్ క్షిపణి(ఎల్ఎమ్ఎమ్) వ్యవస్థనూ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇది తేలికగా మోయగలిగే క్షిపణి. ఎత్తైనా ప్రాంతాలలో ఎక్కడైనా దీనిని సులభంగా వినియోగించుకోవచ్చు. 6 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న విమానాలు, హెలికాఫ్టర్లు, యూఏవీ(డ్రోన్)లు వాటిని అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ టార్గెట్ చేసుకోగల ప్రత్యేకత దీని సొంతం.
ఇవీ చదవండి:
పైనాపిల్ ఈ వ్యక్తులకు విషంతో సమానం.!