Bihar Assembly Elections: తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ నేత ట్విస్ట్
ABN , Publish Date - Oct 07 , 2025 | 09:06 PM
తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై అనిశ్చితి ఉందనే ఊహాగానాలకు ఊతమిచ్చేలా కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తేజస్వి ఆయన పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చని, అయితే 'ఇండియా' కూటమి ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరో నెలరోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన కూటముల మధ్య సీట్ల సర్దుబాటుపై మంతనాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష 'ఇండియా' కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఆసక్తికరమైన చర్చ కూటమి వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆర్జేడీ సారథ్యంలోనే 'మహాకూటమి' ఎన్నికల సమరానికి వెళ్తున్నప్పటికీ ఆ పార్టీ చీఫ్ తేజస్వి యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే విషయంలో అనిశ్చితి నెలకొన్నట్టు కనిపిస్తోంది.
ఆర్జేడీకే ఆయన సీఎం అభ్యర్థి
తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై అనిశ్చితి ఉందనే ఊహాగానాలకు ఊతమిచ్చేలా కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తేజస్వి ఆయన పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చని, అయితే 'ఇండియా' కూటమి ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సీఎం అభ్యర్థిత్వంపై సమష్టిగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్ నిర్ణయం ఏమిటో వేచిచూడాలన్నారు. మహాకూటమిలో ఆర్జేడీ కీలక భాగస్వామిగా కాంగ్రెస్ ఉంది. అయితే ఉదిత్ రాజ్ వాఖ్యలపై ఆర్జేడీ కానీ, తేజస్వి కానీ ఇంకా స్పందించలేదు.
తేజస్వి మనసులో ఏముంది?
తేజస్వి ఇటీవల పలు సందర్భాల్లో పరోక్షంగా తానే ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ సంకేతాలిచ్చారు. 'ఎలాంటి అనిశ్చితి లేదు.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా మేము పోటీ చేయం' అని వ్యాఖ్యానించారు. రాహుల్ ఇటీవల నిర్వహించిన 'ఓటర్ అధికార్ యాత్ర'లోనూ తేజస్వి పాల్గొని ఇందులో తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. ప్రజలే యజమానులని, వారే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంచుకుంటారని, మార్పు కోరుకుంటున్న ప్రజలను ముఖ్యమంత్రి ఎవరని అడిగితే సమాధానం వారే సమాధానమిస్తారని వ్యాఖ్యానించారు. పక్కనే ఉన్న రాహుల్ ఔనని కానీ, కాదని చెప్పకుండా.. కలిసి పోటీ చేస్తాం, ఫలితాలు బాగుంటాయని చెప్పారు.
కాగా, జనతాదళ్ యునైటెడ్ బాస్ నితీష్‌కుమార్‌తో సీఎం పీఠానికి పోటీ పడగల సత్తా తేజస్వికే ఉందనే ప్రచారం ఉంది. అదీగాక లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు కావడం, రెండు సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం, ఆయన సారథ్యంలోనే ఆర్జేడీ 2020లో 75 సీట్లు గెలుచుకోవడం తేజస్వికి కలిసొచ్చే అంశాలు. అయితే ఇంకా చర్చలు జరుగుతున్నాయంటూ సీఎం అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ బహిరంగంగా ప్రకటించడం లేదు.
ఇవి కూడా చదవండి..
పుతిన్‌కు మోదీ ఫోన్.. ఎందుకంటే
ఏడాది తర్వాత కేజ్రీవాల్‌కు ప్రభుత్వ బంగ్లా కేటాయింపు
Read Latest Telangana News and National News