NDA Vice President Poll: ఎన్డీయే అభ్యర్థికి మద్దతుపై బీజేపీకి పవార్, ఉద్ధవ్ ఠాక్రే ఏం చెప్పారంటే
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:20 PM
కేంద్రంలోని అధికార ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేయగా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డిని విపక్ష కూటమి ఎంపిక చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది.
ముంబై: ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా విపక్ష నేతలను బీజేపీ సంప్రదిస్తోంది. ఇందులో భాగంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేలను మద్దతు కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సంప్రదించారు.
దీనిపై శుక్రవారంనాడు మీడియాతో ఫడ్నవిస్ మాట్లాడుతూ, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా పవార్‌ను కోరానని, అయితే విపక్ష కూటమి అభ్యర్థి వెంటే తాము వెళ్తామని ఆయన చెప్పారని తెలియజేశారు. ఉద్ధవ్ ఠాక్రే మాత్రం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారని వివరించారు.
దీనికి ముందు శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఠాక్రేను సంప్రదించారని, ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారని తెలిపారు. మహారాష్ట్రలోని విపక్ష మహాకూటమిలో కాంగ్రెస్‌తో ఎన్‌సీపీ (ఎస్‌పీ), శివసేన (యూబీటీ) భాగస్వాములుగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో 'ఇండియా' కూటమిలో మూడు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. శివసేన (యూబీటీ)కు లోక్‌సభలో 9 మంది, ఎన్‌సీపీ (ఎస్‌పీ)కి 10 మంది ఎంపీలు ఉండగా, రెండు పార్టీలకు రాజ్యసభలో చెరో ఇద్దరు ఎంపీలు ఉన్నారు.
కేంద్రంలోని అధికార ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేయగా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డిని విపక్ష కూటమి ఎంపిక చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. ఎలక్టోరల్ కాలేజీలో 781 మంది ఉండగా, మెజారిటీ మార్క్ 391గా ఉంది.
ఇవి కూడా చదవండి..
50 గంటల అరెస్టుతో ఉద్యోగిని సస్పెండ్ చేస్తుంటే పీఎంలకు ఎందుకు వర్తించదు?
పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
For More National News And Telugu News